పుతిన్‌కు సీరియస్? నయం చేయలేని వ్యాధి సోకి ఉండొచ్చని..
విక్టరీ వేడుకల్లోనూ పుతిన్ బలహీనంగా కనిపించినట్టు స్పష్టం
Vladimir Putin Health: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఎంత భీకరంగా సాగుతుందో పుతిన్ ఆరోగ్యంపైనా అంతే ఉధృతంగా ప్రచారమవుతోంది. మొన్నటివరకు మీడియా కథనాలు నిన్న ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిలిరో బుదనోవ్, ఇప్పుడు మాజీ బ్రిటిష్ గుడచారి, ఓలిగార్చ్‌కు చెందిన రష్యా సంపన్నుడు పుతిన్ అనారోగ్యంపై అనుమానాలు లేవనెత్తారు. అనారోగ్యానికి కారణం ఏమిటో పక్కగా తెలియదని కానీ పుతిన్ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు మాజీ బ్రిటిష్ గుడాచారి క్రిస్టోఫర్ స్టీల్ అన్నారు. బ్లడ్ కాన్సర్‌తో పుతిన్ బాధపడుతున్నట్టు పేరు చెప్పని రష్యా సంపన్నుడు తెలిపారు. పాశ్చాత్య దేశాలకు చెందిన వారే ఎక్కువగా రష్యా అధినేత ఆరోగ్యంపై చర్చించడం యుద్ధంలో ఓ భాగంగా మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్దంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్దం 12 వారాలుగా కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంతో మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పుడు ఉక్రెయిన్, జెలెన్‌స్కీ, పుతిన్ పేర్లు మార్మోగుతున్నాయి. ప్రధానంగా పాశ్చాత్య మీడియాలో మాత్రం ఉక్రెయిన్ యుద్ధం కంటే పుతిన్ ఆరోగ్యంపైనే ఎక్కువగా కథనాలు వస్తున్నాయి. పుతిన్ ఆనారోగ్యానికి గురయ్యాడంటూ ఆయన బాడీలాంగ్వేజ్ మారిందని పలు విశ్లేషణలతో కథనాలు వండివారుస్తున్నాయి. మీడియా కథనాలు ఒకెత్తయితే వాటి ఆధారంగా ప్రముఖులు కూడా ఇప్పుడు పుతిన్ ఆరోగ్యం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు అనారోగ్యానికి గురయ్యారని ఆయనపై అక్కడి నాయకులు తిరుగుబాటు చేయనున్నట్టు ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిలిరో బుదనోవ్ వ్యాఖ్యానించారు. పుతిన్‌పై తిరుగబాటుదారులు తమ ప్రయత్నాలు ప్రారంభించారని కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని కూడా తెలిపారు.
తాజాగా బ్రిటిష్ మాజీ గూఢచారి క్రిస్టోఫర్ స్టీల్ పుతిన్ కండిషన్ సీరియస్‌గా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ఏ వ్యాధితో పుతిన్ బాధపడుతున్నారో స్పష్టంగా తెలియదని కానీ ఇది నయం చేయలేని వ్యాధి అయి ఉండొచ్చని పరోక్షంగా క్యాన్సర్ సోకినట్టు ప్రస్తావించారు. 2016 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయానికి రష్యా పరోక్షంగా సహకరించిందనే మొదటిసారి ఆరోపించింది ఈ క్రిస్టోఫర్ స్టీల్‌నే. ఈ వార్త అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది. ఉక్రెయిన్ దాడికి కొద్ది రోజులు ముందు నుంచే పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు రష్యా అధినేతతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ ఒలిగార్చ్ మాట్లాడిన ఆడియోను అమెరికాకు చెందిన మ్యాగజైన్ న్యూ లైన్స్ బయటపెట్టింది. ఓ అమెరికా వ్యాపారితో పుతిన్ ఆరోగ్యంపై ఓ ఒలిగార్చ్ మాట్లాడినట్టు ఆ మ్యాగజైన్ వివరించింది. విక్టరీ వేడుకల్లోనూ పుతిన్ బలహీనంగా కనిపించినట్టు వెల్లడించారు. రెడ్‌స్క్వేయర్‌లోని సైనిక కవాతు సందర్భంగా వేదికపై ఉన్న వారిలో కేవలం పుతిన్ మాత్రమే కాళ్లపై దట్టమైన ఆకుపచ్చ దుప్పటి కప్పుకుని దగ్గుతూ కనిపించారని చెప్పారు. పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్ చికిత్స జరిగిందని అప్పటి నుంచి బలహీనంగా మారినట్టు ఒలిగార్చ్ తెలిపారు.
పుతిన్ చనిపోయే అవకాశం ఉందని కూడా ఆ ఆడియాలో ఒలిగార్చ్ తెలిపారు. పుతిన్ తీరుతో రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందన్నాడు. సమస్య పుతిన్ ఆలోచనల్లో ఉందని తన విచిత్రమైన ఆలోచనలతో ప్రపంచాన్ని పుతిన్ తలకిందుల చేస్తున్నట్టు ఒలిగార్చ్ ఆరోపించారు. అయితే అనుమతిలేకుండా ఈ ఆడియోను రికార్డు చేశారని అందుకే ఒలిగార్చ్ పేరు వెల్లడించలేనని అమెరికా వ్యాపారవేత్త తెలిపినట్టు న్యూలైన్స్ స్పష్టం చేసింది. ఇటీవల రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో సమావేశమైన సందర్భంలోనూ పుతిన్ టేబుల్‌ను గట్టిగా పట్టుకున్న విషయాన్ని కూడా పాశ్చాత్య మీడియా ఎత్తి చూపుతోంది. అయితే పాశ్చాత్య మీడియా ప్రచారాన్ని రష్యా మాత్రం ఇప్పటివరకు ఖండించలేదు.
యుద్ధంలో గెలుపోటములను పోరాటాల కంటే వ్యూహాలే నిర్ణయిస్తాయి. సైన్యంతో ఎంత విరోచితంగా పోరాడినా రాజు చనిపోయినా లొంగిపోయినా ఇక ఓటమి పాలైనట్టే అంతేకాదు శత్రు సైన్యాన్ని మానసికంగా దెబ్బతీయాలంటే వారి రాజు పారిపోయాడనో లొంగిపోయాడనో ప్రచారం ప్రారంభిస్తారు. ఈ వ్యూహంలో భాగంగానే పుతిన్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తున్నట్టు కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలు అన్నీ ఫేక్ అని తేల్చి చెబుతున్నారు. అదే విక్టరీ డే సందర్భంగా పుతిన్ ఎంతో హుషారుగా కనిపించిన విషయాన్ని వారు వివరిస్తున్నారు. వేదికపై ఉన్న పలువురు మాజీ సైనిక నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చారని ప్రసంగంలోనూ ఆయన ఎక్కడా అస్వస్థతకు గురైనట్టు అనిపించలేదంటున్నారు. కేవలం ఐరోపా, అమెరికాకు చెందిన మీడియాలు, వ్యక్తులే పుతిన్ ఆరోగ్యంపై పుకార్లను సృష్టిస్తున్నట్టు చెబుతున్నారు.
ఏదేమైనా ఇటీవల ప్రపంచ దేశాధినేతల ఆరోగ్యంపై జోరుగా కథనాలు వెలువుడుతున్నాయి. యుద్ధానికి ముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా ఆనారోగ్యంతో చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా అనారోగ్యానికి గురైనట్టు కథనాలు వస్తున్నాయి.