Afghan: ముళ్లకంచెల మీదుగా పిల్లలను యూకే ఆర్మీకి అప్పగిస్తున్న తల్లిదండ్రులు

* లోపలికి విసిరేస్తున్న మరికొందరు * విమానాశ్రయం వద్ద ఇప్పటిదాకా 12మంది మృతి *నిరసనకారులపై కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు

Update: 2021-08-20 02:27 GMT

మ పిల్లలను విదేశీ సైనికులకు అప్పగిస్తున్న తల్లిదండ్రులు (ఫైల్ ఫోటో)

Afghanistan: ''మేము ఏమైపోతామో తెలియదు. మా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కనీసం మా పిల్లలనైనా ఈ నరకం నుంచి బయటకు పంపాలి'

ఇదీ ప్రస్తుతం చాలామంది అఫ్ఘాన్‌ తల్లిదండ్రుల మనసుల్లో మెదులుతున్న మాట. అందుకే గుండెను బండరాయిగా చేసుకుని ఇక పిల్లల్ని తమ జీవితంలో చూడలేమని తెలిసీ కన్నబిడ్డలను విమానాశ్రయం చుట్టూ వేసిన ఇనప ముళ్లకంచెల మీదుగా అవతలివైపు ఉన్న విదేశీ సైనికులకు ఇచ్చేస్తున్నారు.వారు తీసుకోవడానికి ముందుకు రాకపోతే "మీరే మా బిడ్డలను తీసుకెళ్లి కాపాడండి" అంటూ ముక్కుపచ్చలారని పిల్లలను విసిరేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు ఆ ముళ్లకంచెల్లో చిక్కుకుని హృదయవిదారకంగా రోదిస్తుండడం తమ హృదయాలను కలచివేస్తోందంటూ యూకే సైనికులు కంటతడి పెడుతున్నారు. ''ఆ దృశ్యాలను తలచుకుని మా సైనికుల్లో చాలా మంది రాత్రిపూట రోదిస్తున్నారు. నేను వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సివస్తోంది'' అని యూకే సైనికాధికారి ఒకరు తెలిపారు.




ఆదివారం నుంచి ఇప్పటిదాకా కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద దాదాపు 12 మంది చనిపోయారు. కొంతమంది తొక్కిసలాటల్లో చనిపోగా మరికొందరు కాల్పుల్లో ప్రాణాలుకోల్పోయారు. మరోవైపు నిరసనకారులపైనా తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. వారు చెబుతున్న మార్పు మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదని మరోమారు స్పష్టమైంది. అఫ్ఘాన్‌ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 19న (గురువారం) దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ తమ జాతీయ జెండాలను ఎగురవేస్తూ నిరసన ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలను తాలిబన్లు తమదైన శైలిలో కాల్పులతో, లాఠీచార్జ్‌తో అడ్డుకున్నారు. కునార్‌ ప్రావిన్స్‌లోని అసదాబాద్‌లో తాలిబన్లు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయినట్టు తెలుస్తోంది.




తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ జలాలాబాద్‌లో బుధవారం జరిపిన ప్రదర్శనలపై వారు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోరోజూ అవే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. కాగా తాలిబన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా రోడ్ల మీదకు వచ్చి, జాతీయ జెండాను ఎగురవేసి నిరసనలు తెలుపుతున్నవారికి, దేశగౌరవాన్ని నిలుపుతున్నవారికి శాల్యూట్‌ చేస్తున్నట్టు అఫ్ఘాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్లు పాలించలేనంత పాకిస్థాన్‌ మింగేయలేనంత పెద్ద దేశమని ట్వీట్‌ చేశారు. ''ఉగ్రవాదులకు తలొగ్గిన అధ్యాయం మీ చరిత్రలో లేకుండా చూసుకోండి'' అంటూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News