చైనాతో గాడిదల వ్యాపారానికి పాక్ పాలకుల డీల్
Pakistan Economy Crisis: పాకిస్తాన్ ఓ సరికొత్త వ్యాపారానికి తెర లేపింది.
Pakistan Economy Crisis: పాకిస్తాన్ ఓ సరికొత్త వ్యాపారానికి తెర లేపింది. చైనాలో గాడిద మాంసానికి, గాడిద శరీర భాగాలతో తయారయ్యే బై ప్రోడక్ట్స్‌తో ఎంతోకొంత ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తోంది. చైనాలో వివిధ రకాల జంతువుల్లాగే గాడిద మాంసానికి కూడా బాగా గిరాకీ ఉంది. ఒక్క బీజింగ్ లోనే 500 రెస్టారెంట్లలో గాడిద మాంసం విరివిగా దొరుకుతుంది. అందులో యాంటీ యాక్సిడెంట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని చైనీయులు భావిస్తారు.
అలాగే గాడిద ఎముకలు, చర్మం, పాలకు పుష్కలమైన గిరాకీ ఉంది. వివిధ రకాల కాస్మొటిక్ ఉత్పత్తుల్లో వాటిని ఉపయోగిస్తున్నారు. అటు పాకిస్తాన్లోని ఖైబర్ పష్తూంఖ్వా ప్రావిన్స్ లోని గిరిజన ప్రాంతాల్లో గాడిదల్ని పోషిస్తూ బతికే కుటుంబాలు 70 వేలకు పైగానే ఉన్నాయి. వారికి ఉపాధి కల్పించడంతో పాటు ఖజానాకు ఉపయోగపడేలా పాక్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ కంట్రీతో దాదాపు 2 బిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆ పెట్టుబడితో పాక్‌లో గాడిదల్ని పెంచి వాటిని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తారు.