పాకిస్తాన్‌లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని షరీఫ్
Shehbaz Sharif: దేశంలో హింస చెలరేగాలని షెబాజ్ కుట్ర చేస్తున్నారన్న ఇమ్రాన్ ఖాన్
Shehbaz Sharif: పాకిస్తాన్‌లో ఇక మీ ఆటలు సాగవంటూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కౌంటర్ ఇచ్చారు ప్రధాని షెబాజ్ షరీఫ్. మీరిచ్చే డిక్టేషన్ తీసుకోడానికి ఇక్కడ ఎవరూ లేరంటూ ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగారు ప్రధాని షరీఫ్. పాకిస్తాన్‌లో తక్షణమే ఎన్నికలు జరిపించాలని ఇమ్రాన్ చేస్తున్న డిమాండ్‌ను ఆ దేశ ప్రధాని తోసిపుచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది నేషనల్ అసెంబ్లీ నిర్ణయిస్తుందని ఇమ్రాన్ ఖాన్ కాదన్నారు. డాన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ తీరును తప్పుబట్టారు.
తక్షణం పాకిస్తాన్ లో ఎన్నికలు నిర్వహించాలని గత కొద్ది రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అకారణంగా తనను పదవిలోంచి దించేశారంటూ ప్రజలకు వివరిస్తున్నారు ఇమ్రాన్. ర్యాలీల ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ఐతే ఇమ్రాన్ ర్యాలీలతో ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు పాక్ పీఎం షరీఫ్. మరోవైపు ఇస్లామాబాద్‌లో ఆందోళన తర్వాత ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు డి-చౌక్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.
పాకిస్తాన్ ప్రధానికి కేవలం ఆరు రోజుల డెడ్ లైన్ విధిస్తున్నానన్నారు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా దేశ ప్రజలందరితో వచ్చి రాజధానిని ముట్టడిస్తానన్నారు. పోలీసుల ఆంక్షలను అడ్డుకొని ఇస్లామాబాద్ రెడ్ జోన్ చేరుకున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఐతే పోలీసులతో చర్చల తర్వాత వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ఎప్పటి వరకు ఎన్నికలు నిర్వహించ ఉంటే అప్పటి వరకు డి-చౌక్ వద్ద బైఠాయిస్తానన్నారు ఇమ్రాన్. మరోవైపు దేశంలో హింస చెలరేగాలని షెబాజ్ కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు.