ఆగని ఉత్తర కొరియా దూకుడు.. మళ్లీ 2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగం
North Korea: వారంలో నాలుగోసారి క్షిపణుల ఫైరింగ్
North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నారు. తాజాగా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల ను ప్రయోగించినట్టు జపాన్, దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ వారంలో ఇది నాలుగో ప్రయోగం కావడం గమనార్హం. ఇటీవల జపాన్, దక్షిణ కొరియా, అమెరికా త్రైపాక్షిక నేవీ విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ చర్చకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ దక్షిణ కొరియా పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఉత్తర కొరియా క్షిపణనులను ప్రయోగించింది.
ఇక తాజా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను కొరియన్ సముద్రతీరంలోని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా, జపాన్ తెలిపాయి. ఇవి 350 నుంచి 400 కిలోమీటర్లు లక్ష్యాన్ని చేధించినట్టు వివరించాయి. కిమ్ మిస్సైళ్ల ప్రయోగంపై దక్షిణ కొరియా, జపాన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. జపాన్, కొరియా సముద్ర జలాల్లో ఉత్తర కొరియా తీవ్ర ఉద్రిక్తతలను సృష్టిస్తోందంటూ ఆరోపించారు. కిమ్ మిస్సైళ్ల ప్రయోగాన్ని ఖండించారు. అయితే అమెరికాపై ఒత్తిడి పెంచి.. ఆంక్షలను తొలగించేలా చేయాలనే కిమ్ జోంగ్ ఉన్ క్షిపణుల ప్రయోగానికి తెగబడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.