వార్‌జోన్‌లో మే 9న ఏం జరగబోతోంది?.. పుతిన్ నిర్ణయంపై ఉక్రెయిన్‌లో టెన్షన్..!
Ukraine Russia War: మే 9న ఉక్రెయిన్ వార్‌జోన్‌లో ఏం జరగబోతోంది..? యుద్ధంపై పుతిన్ తీసుకోబోతున్న సంచలన నిర్ణయమేంటి..?
Ukraine Russia War: మే 9న ఉక్రెయిన్ వార్‌జోన్‌లో ఏం జరగబోతోంది..? యుద్ధంపై పుతిన్ తీసుకోబోతున్న సంచలన నిర్ణయమేంటి..? ఈ రెండు ప్రశ్నలే ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధం అదే రోజు మరోరూపు తీసుకోవడం ఖాయమన్న వేళ యావత్ ప్రపంచం చూపు అటువైపే ఉంటోంది. ఇంతకూ, రష్యాకీ, మే 9కి ఉన్న లింకేంటి..? ఆరోజు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..?
2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన ఈ రోజు హిస్టరీలో నిలిచిపోతుంది. 2022 మే 9 పుతిన్ తీసుకోబోయే నిర్ణయంతో ఈ రోజు కూడా చరిత్రకు సాక్ష్యంగా మారబోతోంది. ఇప్పుడీ అంశమే ఉక్రెయిన్ సహా పశ్చిమ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. సుదీర్ఘ యుద్ధంతో చిర్రెత్తిపోతున్న పుతిన్ మే 9న గేర్ మార్చబోతున్నారన్న వార్త ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను పెంచేస్తోంది. అయితే, మే 9నే ప్రత్యేకించి ఎన్నుకోవడం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది. ఆరోజు రష్యాకు స్పెషల్ డే. దీంతో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇంతకూ, మే 9 రష్యాకు ఎందుకంత స్పెషల్..? ఉక్రెయిన్ వార్‌జోన్‌లో ఆరోజేంజరగబోతోంది..?
1945 మే 9.. ఈ రోజు రష్యా మోస్ట్ స్పెషల్ డే. రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ పోరాటం. 1939 సెప్టెంబర్ లో పోలాండ్‌పై జర్మనీ దండయాత్రతో ప్రారంభమై 1945లో ముగిసింది. ఈ యుద్ధంలో పది లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసవెళ్లారు. ఈ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిన దేశాల విస్తృత కూటమిలో సోవియట్ యూనియన్ ఒకటి. పైగా రెండో ప్రపంచయుద్ధం ఎక్కువభాగం రష్యా భూభాగంలోనే జరిగినందున రష్యన్లకు ఈ యుద్ధం మరింత ప్రత్యేకం. మే 1945లో, నాజీ జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి, లొంగిపోతున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద పత్రం ఈ యూరప్ ఖండంలో వివిధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది. కానీ, ఆసియాలో జపాన్ పై యుద్ధం అదే సంవత్సరం ఆగస్టు వరకు కొనసాగింది. అధికారికంగా మే 8న బెర్లిన్ సమీపంలో ఈ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేసింది జర్మనీ. ఆ దేశస్తులు అధికారికంగా అన్ని కార్యకలాపాలను స్థానిక సమయం రాత్రి 11 గంటల ఒక్క నిమిషానికి నిలిపివేశారు. అప్పటికే మాస్కోలో అర్ధరాత్రి దాటింది.
విక్టరీ డేను అమెరికాతోపాటు, యూరప్ దేశాలు మే 8న జరుపుకుంటుండగా, రష్యా, సెర్బియా , బెలారస్‌లలో మాత్రం మే 9న జరుపుకుంటారు. ఆ రోజు సుదీర్ఘమైన నెత్తుటి యుద్ధాన్ని ముగించింది. సోవియట్ యూనియన్‌లోని చాలా కుటుంబాలు తమ బంధువులను కోల్పోయాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ, రష్యాలో మే 9 అసలు ఉద్దేశాన్ని మరచి జాతీయ సైద్ధాంతిక సాధనంగా మార్చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు మే 9 సోవియట్ యూనియన్‌లో నేషనల్ హాలిడే కాదు. విక్టరీ డేలో భాగంగా పెద్ద ఎత్తున పండగ నిర్వహించడం, బాణాసంచా కాల్చడం లాంటివన్నీ ప్రధాన నగరాల్లో మాత్రమే జరిగేవి. 1963 నుంచి అప్పటి యూఎస్ఎస్ఆర్ నేత లియోనిడ్ బ్రెజ్నెవ్ నాజీ జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని జాతీయ ఆరాధన దినంగా పాటించడం ప్రారంభించారు.
సరిగ్గా ఇప్పుడు అదే రోజు ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్ సంచలన నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై దాడులను స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌గా చెబుతూ వస్తున్న మాస్కో.. మే 9న అధికారిక యుద్ధంగా ప్రకటించబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుతిన్ ఈ ప్రకటన చేసేందుకు ఇంతకు మించిన రోజు మరొకటి ఉందడనేది ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట. అయితే, రష్యా అధ్యక్షుడు సైనిక చర్యను యుద్ధంగా ప్రకటిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.? యుద్ధం తీరు మే 9 తర్వాత ఎలా మారబోతోంది..? ఇప్పుడీ ప్రశ్నలే ఉక్రెయిన్‌ను టెన్షన్ పెడుతున్నాయి. అందరూ అనుకుంటున్నట్టు పుతిన్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే మాత్రం ఉక్రెయిన్‌లో ఊహించని విధ్వంసం జరగడం ఖాయం.
ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ప్రకటిస్తే రిజర్వ్ బలగాలను బరిలో దించడానికి వీలుంటుంది. నిజానికి రష్యా పూర్తిస్థాయి బలగాలతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించి ఉంటే ఈపాటికే యుద్ధం ముగిసిపోయేది. కానీ, తమది సైనిక చర్యగా మాత్రమే ప్రకటించుకున్న పుతిన్ యుద్ధం ప్రకటించకుండా మొత్తం సైన్యాన్ని దించితే ప్రపంచం ముందు నెగిటివ్ అవుతామన్న ఆలోచనతోనే ఇప్పటి వరకూ ఆచితూచి అడుగులేస్తూ వచ్చింది. అయితే, ఫలితాలు మాత్రం ఊహించని విధంగా రాకపోవడం, మరియుపోల్ మినహా సాధించిందేం లేకపోవడం లాంటి పరిణామాలకు తోడు మే 9కి మించిన రోజు మళ్లీ దొరకదనే భావనలో పుతిన్ ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో అదేరోజు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి, వార్‌జోన్‌లో గేర్ మార్చేయాలని పుతిన్ డిసైడ్ ఐనట్టు కనిపిస్తోంది. ఒక్కమాటలో అదే జరిగితే ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమన్న వార్తలు పశ్చిమ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
మే 9 పుతిన్ చేయబోయే సంచలన ప్రకటన గురించి మరో వార్త ఉత్కంఠ రేపుతోంది. ఉక్రెయిన్‌పై ఇప్పటికే భారీ విజయం సాధించినట్టు కానీ, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగానీ ప్రకటించే అవకాశాలున్నయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో తాము చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్‌తో కాదు నాజీలతో అని ప్రకటించడం ద్వారా ప్రజామద్దతును కూడగట్టాలనేది పుతిన్ ప్లాన్‌గా పలువురు విశ్లేషిస్తున్నారు. జెలెన్‌స్కీ సర్కార్‌ను నాజీల ప్రభుత్వంగా ప్రజలకు చూపించి ప్రజా మద్దతు కూడగడితే యుద్ధం తీరు మారిపోతుందన్నది పుతిన్ మరో ప్లాన్‌గా కనిపిస్తోంది. మరోవైపు మాస్కోపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్ధిక ఆంక్షలకు ప్రతీకారం తీర్చుకునే చర్యల ఉత్తర్వులపై ఇప్పటికే పుతిన్ సంతకం చేశారు. అదేరోజు లెక్కకుమించి శత్రుదేశాలపై యాక్షన్ షురూ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఇదంతా ఒకెత్తయితే మరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న ఇన్నిరోజుల తర్వాత పుతిన్ సేనల కదలికలు టెన్షన్ పెడుతున్నాయి. అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్ చుట్టూ భారీ ఎత్తున పుతిన్ సేనలు మోహరిస్తున్నట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ చెబుతోంది. మరిపోల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్లొద్దని పుతిన్ ఆదేశించారు. అయితే, ఇప్పుడు మాత్రం అక్కడ సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది. ప్లాంట్‌లోకి చొచ్చుకుపోతూ త్రివిధ దళాలు నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. ఐరాస చొరవతో ప్లాంట్ ఆవరణ నుంచి పౌరుల తరలింపులు ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు పుతిన్ సేనలు దూకుడుగా వ్యవహరించడం ఏదో జరగబోతోందనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఇలా ఎటుచూసినా యుద్ధంపై మాస్కో అడుగులు అర్ధం కాక ఉక్రెయిన్ సేనలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఓ వైపు పుతిన్ సేనల అంతుచిక్కని కదలికలు మరోవైపు తరుముకొస్తున్న మే 9 ఈ రెండు అంశాలే ఇప్పుడు ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలనూ, మాస్కోపై ఆర్ధిక ఆంక్షలు విధించిన దేశాలనూ భయపెడుతున్నాయి. మే 9న పుతిన్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించినా, ప్రకటించకున్నా ఉక్రెయిన్‌పై దండయాత్రలో గేర్ మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ యుద్ధం ప్రకటించి పూర్తి స్థాయి సైన్యాన్ని రంగంలోకి దించితే మాత్రం వార్‌జోన్‌లో ఊహించని కల్లోలం జరగడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే సైనిక చర్య పేరుతో దండెత్తితేనే ఉక్రెయిన్ దాదాపుగా నామరూపాల్లేకుండా పోయింది. అలాంటిది పూర్తిస్థాయి యుద్ధం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కమాటలో ఉక్రెయిన్ వార్‌జోన్‌లో అసలైన యుద్ధం మే 9నే జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.