China: వూహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్.. ఒక్క రోజులో 18 కరోనా కేసులు నిర్ధారణ
China: అత్యవసర సేవలు మినహా.. అన్ని మూసివేత
China: కరోనా ఎక్కడ పుట్టిందంటే టక్కున చైనాలోని వూహాన్ అంటూ ఇట్టే చెప్పేస్తారు. ప్రపంచ దేశాలను గడగడలాడించి తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఈ వైరస్ తొలి కేసు వూహాన్‌లోనే వెలుగు చూసింది. కోవిడ్ మూలాలపై స్పష్టత లేకపోయినప్పటికీ వూహాన్‌లోనే వైరస్ పుట్టిందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. అలాంటి వూహాన్‌లో తాజాగా మళ్లీ కేసులు నిర్ధారణ కావడంతో కలకలం రేపుతోంది. 9 లక్షల మంది జనాభా ఉన్న వ్యూహాన్ రీజియన్‌లోని హన్ యాంగ్ జిల్లాలో తాజాగా 18 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వూహాన్ ప్రాంతంలోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించింది. కేసు నిర్ధారణ అయిన ప్రాంతాన్ని పూర్తిగా మూసేస్తుంది. తాజాగా వూహాన్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవలు మినహా.. అన్ని కార్యకలాపాలను ఆపేసింది. తాజాగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని వూహాన్ అధికారులు చెప్పారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. పరిస్థితులను బట్టి.. తదపరి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలోనే తొలిసారి లాక్‌డౌన్ విధించిన ప్రాంతం ఈ వూహానే. అక్కడి ప్రయోగశాలలో నుంచే వైరస్ బయటికి వచ్చిందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. అయితే ఆ వూహాన్‌లో 2020 ఏప్రిల్ నాటికే వైరస్‌ను పూర్తిగా నిర్మూలించినట్టు డ్రాగన్ కంట్రీ చెబుతోంది. కానీ తాజాగా మళ్లీ కొత్త కేసులు నమోదవడం.. ఆందోళనకు గురి చేస్తోంది. అదే వూహాన్‌లోని జియాంగ్‌షియా జిల్లాలో ఇటీవలే లాక్‌డౌన్ విధించారు. జియాంగ్‌షియా, షాపి, హాన్‌యాంగ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చైనా ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్ విధించారు. నిజానికి చైనాలో ఒక్క కేసు నమోదైనా.. అక్కడి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. కేసు వెలుగు చూసిన ప్రాంతాన్ని నిర్బంధించి.. వేలాది మందికి నిత్యం పరీక్షలు నిర్వహిస్తూ.. అక్కడి అధికారులు హల్‌చల్ చేస్తున్నారు. జీరో కోవిడ్ పాలసీతో ప్రజలను బలవంతంగా క్వారంటైన్‌ను తరలిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కంటే.. క్వారంటైన్‌కు తరలించడంతోనే అక్కడి ప్రజలు మరింత భయపడుతున్నారు.
చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల మందిపైగా వైరస్ బారిన పడ్డారు. 24వేల 806 మంది వైరస్ బారిన పడి.. మృతి చెందారు. తొలిసారి కరోనా విజృంభించిన సమయంలోనే వైరస్ కట్టడికి జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే 2021 చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ అదుపులోకి వచ్చింది. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా ఏ దేశంలోనూ పెద్దగా కరోనా నిబంధనలు అమలు చేయడం లేదు. కానీ.. చైనా మాత్రం ఇప్పటికీ వైరస్ పేరు చెబితే ఉలిక్కిపడుతోంది. ఒక్క కేసు నమోదైతే.. వెయ్యి కేసులు నమోదవుతున్నట్టుగా భయాందోళనకు గురవుతోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. డ్రాగన్ మాత్రం వైరస్‌ను పారదోలేకపోతోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. జిన్‌పింగ్ ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్‌కు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఎక్కడ లాక్‌డౌన్ ప్రకటిస్తారోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస లాక్‌డౌన్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండిలేని పరిస్థితి నెలకొన్నది.