ఉక్రెయిన్ లో జిల్ బైడెన్, జస్టిన్ ట్రుడో ఆకస్మిక పర్యటన
జెలెన్స్ స్కీ సతీమణితో అమెరికా ప్రథమ మహిళ భేటీ
Ukraine: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ లో ఇద్దరు విదేశీ ప్రముఖులు పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనాతో సమావేశమైన జిల్ బైడెన్ యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. వీరు ఇరువురు ఉక్రెయిన్- స్లొవేకియా సరిహద్దుల్లోని గ్రామంలో సమావేశమైయ్యారు. గ్రామంలోని ఓ పాఠశాలలో కలుసుకొని మాట్లాడుకున్నారు.
స్లొవేకియాలోని ఓ పట్టణానికి చేరుకున్న జిల్ బైడెన్.. అక్కడి నుంచి వాహనంలో ఉక్రెయిన్ సరిహద్దు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి స్కూల్ క్లాస్ రూమ్‌లో ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీతో జిల్ బైడెన్ సమావేశమయ్యారు. వారిద్దరు కొంత సేపు విడిగా మాట్లాడుకున్నారు. సుమారు రెండు గంటలపాటు ఉక్రెయిన్‌లో ఉన్న జిల్ బైడెన్ ఆ దేశంపై రష్యా యుద్ధం క్రూరమైందని ఆరోపించారు. ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నారు. ఉక్రెయిన్ ప్రజల వెంట అమెరికా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పౌరులపై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాడని ట్రూడో ఆరోపించారు. పశ్చిమ దేశాలు ఖచ్చితంగా పుతిన్ కు వ్యతిరేకంగా నిలబడతాయని స్పష్టం చేశారు.