ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా రక్తసిక్తం... పెద్దపెద్ద గోతుల్లో తమవారిని వెతుక్కుంటున్న సామాన్య జనం

Update: 2024-09-10 16:34 GMT

రాత్రివేళ.. చిమ్మచీకటి.. పెద్ద పెద్ద ఆర్తనాధాలు.. ‘నాన్నా నువ్వెక్కడున్నావ్? ఎందుకు కనిపించడం లేదు’ అని ఓ చిన్నారి బిగ్గరగా అరుస్తూ, గుక్కపెట్టి ఏడుస్తోంది.

అప్పటివరకు అమ్మ చేతి గోరుముద్దలు తిన్న మరో చిన్నారి ఉన్నట్టుండి అమ్మ కనిపించడం లేదనే ఏడుపు మరోవైపు.

అక్క కోసం ఓ తమ్ముడి ఆరాటం.. చెల్లి కోసం ఓ అన్న.. బిడ్డ కనిపించడం లేదని మరో తల్లి.. భార్య కోసం భర్త.. భర్త కోసం భార్య.. ఇలా వాళ్లందరూ కలిసి మొబైల్ ఫోన్ల ఫ్లాష్ లైట్లు, టార్చ్ లైట్ల వెలుతురులో తమ కళ్ల ముందున్న ఇసుక దిబ్బలను, గోతులను ఆతృతగా తవ్వుతున్నారు.

ఓవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే.. మరోవైపు చేతికి ఏది కనిపిస్తే అది తీసుకుని ఇసుకను పక్కకు లాగుతున్నారు. ఏది కనిపించకపోతే తమ అరచేతులనే పారలుగా మలిచి హడావుడిగా తమ కళ్ల ముందున్న 10 మీటర్ల గొయ్యిని ఇంకా లోపలికి తవ్వుతున్నారు. ఇంకొంతమంది ఆ మట్టిని పక్కకు లాగేస్తూ వారికి సాయం చేస్తున్నారు.

ఎవరు బతికున్నారు.. ఎవరు చనిపోయారు.. కనిపించకుండా పోయిన వాళ్లేరి.. చుట్టూ ఎందరో ఉన్నా... అయినవారు కనిపించడం లేదే అనే ఆవేదన! మిన్నంటిన రోదనల్లోనూ ఎవ్వరిని ఎవ్వరూ ఓదార్చేంత తీరికలేని దుస్థితి.. అందరి ప్రయత్నం ఒక్కటే... అందరి ఆరాటం ఒక్కటే.. తమ కళ్ల ముందున్న పెద్దపెద్ద గోతుల్లో ఇసుక మాటున ఎవరి జాడయినా దొరుకుతుందా? కొనఊపిరితోనైనా ఎవరైనా కనిపిస్తారా? మనిషి బతికుండకపోయినా కనీసం శవమైనా దొరుకుతుందా? గాజాలోని మవాసి అనే ప్రాంతంలో తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన చోట కనిపించిన హృదయవిదారక దృశ్యాలివి.

అందరూ నిద్రిస్తున్న సమయం. యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు పాలస్తినా శరణార్ధులు తలదాచుకున్న శిబిరాలు ఉన్న ప్రాంతం అది. ఉన్నట్లుండి భారీ శబ్ధాలతో రాకెట్ లాంచర్లతో బాంబుల దాడి మొదలైంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ ఎయిర్ స్ట్రైక్స్ తీవ్రతకు 10 మీటర్ల లోతులో పెద్దపెద్ద ఇసుక గోతులు ఏర్పడ్డాయి. ఆ ఇసుక గొయ్యిల చుట్టే ఈ జనం అంతా గుమిగూడి తమ వాళ్ల ఆచూకీ కోసం అదేపనిగా వెతుకుతున్నారు.

గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో 40 మంది చనిపోయారు. 60 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కూడా దొరకలేదు.

అందుకే, తమ వాళ్ళు ఈ ఇసుక గోతుల్లో కూరుకుపోయి ఉంటారా? ఉంటే ప్రాణాలతో ఉన్నారా? లేక వైమానిక దాడిలో తునాతునకలై ఇసుక గొయ్యిలోనే సమాధి అయ్యారా.. అనే ఆలోచనలు వారిని ఉన్నచోట ఉండనివ్వడం లేదు. కాలు కింద భూమి కదిలిపోతున్నట్లు ఏదో తెలియని భయం వారికి ఊపిరాడనివ్వడం లేదు. అందుకే, క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఇసుకగోతులను అదేపనిగా తవ్వుతున్నారు.

గాజాలోని మవాసి ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో గాయాలపాలై కదలలేని వారి పరిస్థితి ఇంకా ఘోరం. వారు బతికే ఉన్నప్పటికీ.. ఈ యుద్ధంలో వైమానిక దాడులకు సజీవ సాక్షులుగా, జీవితాంతం జీవచ్చవాలుగా మిగిలిపోవాల్సిందే తప్ప చేసేదేం లేదు.

ప్రతీకారంతో రగిలిపోతున్న హమాస్

ఇజ్రాయెల్ అన్యాయంగా 40 మంది పౌరులను పొట్టనపెట్టుకుందని హమాస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఈ దాడి కారణంగా అమాయకపౌరులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన శిబిరాల టెంట్లు కాలిపోయాయి. ‘10 మీటర్ల లోతున ఏర్పడిన గోతుల్లోంచి ఒక్కొక్కటిగా శవాలను వెలికి తీస్తున్నాం. ఇప్పటివరకు 40 శవాలు దొరికాయి. ఇంకో 15 మంది ఆచూకీ కనిపించడం లేదు.' ఇజ్రాయెల్‌పై ఆగ్రహంతో ఊగిపోతూ హమాస్ నేతలు చెబుతున్న మాటలివి.

మృతుల సంఖ్యపై గాజా ప్రభుత్వం చెబుతున్న లెక్కలు

గాజా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 40,000 మంది పాలస్తినా ప్రజలు చనిపోయారు. అందులో గాజా కోసం పోరాడుతున్న ఫైటర్స్ ఎంతమంది ఉన్నారు, పౌరులు ఎంతమంది ఉన్నారో వేర్వేరుగా లెక్కచెప్పడం కష్టమేనని అన్నారు.

ఇంతకీ ఇజ్రాయేల్ ఏమంటోంది..?

తాము హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకునే ఈ వైమానిక దాడులు జరిపామే కానీ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఏదేమైనా పౌరులను ఈ దాడుల్లోకి లాగిన పొరపాటు హమాస్ దే అవుతుందని, హమాస్ మిలిటెంట్లు జనావాసాల మధ్య తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. విద్యా సంస్థలు, మసీదులున్న ప్రాంతాల్లో ఉంటూ దాడులు చేస్తున్న హమాస్ మిలిటెంట్లే అక్కడి పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను హమాస్ నాయకులు తోసిపుచ్చుతున్నారు.

ఏది ఏమైనా, గాజా మీద తాజాగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో చనిపోయిన వారిలో చాలా మంది సాధారణ పౌరులేనని తెలుస్తోంది. విమానాలు పేల్చిన బాంబులతో పడిన లోతైన గుంతల్లో పడిపోయిన వారి కోసం, చనిపోయిన వారి కోసం ప్రజలు కన్నీళ్ళతో వెతుకుతున్న దృశ్యాలు చూస్తే వాస్తవం ఏమిటో అర్థమైపోతుంది. 11 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే రెండు ప్రాంతాలకు చెందిన వారు కలిపి 40 వేల మందికి పైగా చనిపోయారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ రక్తపాతానికి ముగింపు ఎప్పుడు?

Tags:    

Similar News