Anti-Hijab Row: ఆందోళనలు చేస్తే.. దేవుడికి శత్రువే.. ఓ నిరసనకారుడికి మరణ శిక్ష

Iran: ఆందోళనలు చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దేవుడికి శత్రువేన.

Update: 2022-11-14 15:00 GMT

Anti-Hijab Row: ఆందోళనలు చేస్తే.. దేవుడికి శత్రువే.. ఓ నిరసనకారుడికి మరణ శిక్ష

Iran: ఆందోళనలు చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దేవుడికి శత్రువేన. తాజాగా ఇరాన్ ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది. హిజాబ్‌ ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులపై విరుచుకుపడింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టిన ఓ నిరసనకారుడికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. మరో ఐదుగురికి 10 ఏళ్ల జైళ్లు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దోషులుగా ఉన్నవారు తమ శిక్షపై అప్పీలు చేసుకోవచ్చని మాత్రం కాస్తా ఊరటనిచ్చింది. తాజాగా ఆ వివరాలను ఇరాన్‌ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగించి.. జాతీయ భద్రతకు ముప్పు కల్పించినట్టు నిరసనకారులపై ఆరోపణలు గుప్పించింది. ఆమేరకు నిరసనకారులను నేరస్థులుగా గుర్తించి... టెహ్రాన్‌ కోర్టు వారికి శిక్షలను విధించింది. ఇటీవల కొంత కాలంగా ఇరాన్‌ వ్యాప్తంగా హిజాబ్‌ నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది మహిళలు ఆందోళనకు దిగారు. హిజాబ్‌ను బహిరంగంగానే తగులబెట్టారు. మహ్‌సా అమినీ మృతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని సెప్టెంబరు 16న పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కస్టడీలో మృతి చెందడం ఇరాన్‌లో తీవ్ర దుమారం రేపింది. రెండు నెలలుగా హిజాబ్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా మహిళలు తమ జట్టును కత్తిరించుకుంటున్నారు. అమిని మృతికి కారణమైన హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ కాల్చేస్తున్నారు. అమినిని అరెస్టు చేసి హింసించిన మొరాలిటీ పోలీసులకు శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు వందల మందికి పైగా నిరసనకారులు చనిపోయారు. అమిని మృతి, ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అమిని మృతిని ఖండించింది. ఈ ఘటనపై వెంటనే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని యూఎన్‌ డిమాండ్‌ చేసింది. ఆందోళనకారులపై దాడులను యూఎన్ మానవ హక్కుల విభాగం ఖండించింది. అంత జరిగినా.. ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. సరికదా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవలే హెచ్చరించారు.

నిరసనల సమయంలో ఆందోళనకారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. దీన్ని ప్రభుత్వం అల్లర్లుగా అభివర్ణిస్తోంది. నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా మూడు ప్రావిన్సుల్లో ఏకంగా 750 మందిపై కేసులు నమోదైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నిరసనల్లో పాల్గొన్నట్టు ఆరోపిస్తూ 2వేల మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో సగానికి పైగా రాజధాని ట్రెహ్రాన్‌లో ఉన్నవారే. దక్షిణ ప్రావిన్స్‌ హోర్మోజ్‌గాన్‌లో 164 మందిపై అల్లర్ల కేసులను నమోదు చేసినట్టు మిజాన్ ఆన్‌లైన్ వెల్లడించింది. ఇక హత్యకు ప్రేమించడం, భద్రతా దళాలకు హని కలగించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారు దేవుడికి వ్యతిరేకులుగా ఇరాన్ ప్రభుత్వం పేర్కొంటోంది. ఇరాన్‌ సెంట్రల్‌లోని మర్కాజీ ప్రావిన్స్‌లో 276 మందిపై, ఇస్ఫాహాన్‌ ప్రావిన్స్‌లో 316 కేసులు నమోదయ్యాయి. ఆందోళనల్లో మొత్తం 15వేల మందిని అదుపులోకి తీసుకున్నట్టు విదేశాలకు చెందిన మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్‌ మాత్రం ఆ సంఘాల వాదనలను ఖండిస్తున్నాయి.

హిజాబ్‌ ఆందోళనల వెనుక అమెరికా, మిత్రదేశాల కుట్ర ఉందని ఇరాన్‌ ప్రభుత్వం ముందు నుంచీ ఆరోపిస్తోంది. ఇరాన్‌ను బలహీన పరిచేందుకు అమెరికా యత్నిస్తోందని విమర్శిస్తోంది. దేశంలో స్థిరత్వాన్ని, భద్రతను బలహీనపరిచేందుకు వాషింగ్టన్‌ నిత్యం ప్రయత్నం చేస్తోందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాజర్‌ కనానీ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల తరువాత మెరాలిటీ పోలీసులపై అమెరికా ఆంక్షలను విధించింది. మహ్సా అమిని మృతికి మొరాలిటీ పోలీసులే కారణమంటూ యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆరోపించింది. ఇరాన్‌ మహ్సా అమినీ మృతికి నిరసనగా బ్రిటన్, టర్కీ, కెనడా, ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, నార్వే దేశాల్లో ముస్లిం వర్గాలు ఆందోళనలు చేశాయి. 2019 తరువాత ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తాజా ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఖండించారు. ఇది సరైన విధానం కాదని.. ఇరాన్ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించారు. 

Tags:    

Similar News