India Tells Canada: కెనడా నుండి ఇండియన్ హై కమిషనర్, దౌత్యవేత్తలు వెనక్కి.. తేల్చిచెప్పిన భారత్

Update: 2024-10-14 14:45 GMT

India's Serious Note To Canada: ఇండియా - కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యను కెనడాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్‌తో పాటు ఇంకొంతమంది దౌత్యవేత్తలకు ముడిపెడుతూ కెనడా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. "కెనడాలో భారత హై కమిషనర్‌కి, దౌత్యవేత్తలకు, ఇతర ఉన్నతాధికారులకు రక్షణ కల్పించే విషయంలో ప్రస్తుత కెనడా ప్రభుత్వాన్ని నమ్మలేం" అని భారత్ అభిప్రాయపడింది. సోమవారం సాయంత్రం కెనడా రాయబారిని పిలిపించి మాట్లాడిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి, ఇదే విషయాన్ని వారికి స్పష్టంచేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రభుత్వం అనుమానిస్తున్న భారత హై కమిషనర్, భారత దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారులను వెనక్కి పిలిపించుకుంటున్నట్లు భారత్ తేల్చిచెప్పింది.

ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా నుండి ఒక సమాచారం అందించింది. కెనడాలో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా అక్కడి భారత హై కమిషనర్, దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తంచేసింది. ఈ హత్యలో వారికి ప్రమేయం ఉందని కెనడా చేసిన పరోక్ష వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించే విషయంలో కెనడా చిత్తశుద్ధిని విశ్వసించలేమని ఈ సందర్భంగా భారత్ వ్యాఖ్యానించింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ని తప్పుపట్టడం ఏంటని కెనడాని ప్రశ్నించింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే అస్సలు సహించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టంచేసింది.

భారత్‌కి వ్యతిరేకంగా, భారత సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా దేశాన్ని విచ్చిన్నం చేసే అసాంఘిక శక్తులకు కెనడా మద్దతిస్తోందని భారత్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ అంశంపై తాము మరింత కఠినంగా వ్యవహరిస్తామని కెనడాకు తేల్చిచెప్పింది. భారత్‌కి వ్యతిరేక ఉద్యమాలు చేస్తోన్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, నేతలకు కెనడా ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి మద్దతిస్తోందనే ఉద్దేశంతోనే భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. కెనడా వ్యవహరించిన తీరుతో ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి. తాజాగా కెనడా వ్యాఖ్యలను తిప్పికొడుతూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ సంబంధాలు మరింత దెబ్బతిన్నట్లయింది.

అయితే, భారత్ తీసుకున్న నిర్ణయంపై కెనడా ఏమని స్పందిస్తుందనేదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకుంది. భారత్ ఆరోపిస్తున్నట్లుగా కెనడా తమ రాజకీయ స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తుందా లేక ఇకనైనా కాస్త వెనక్కి తగ్గి భారత వ్యతిరేకి అనే ముద్ర నుండి బయటపడుతుందా అనేది వేచిచూడాల్సిందే.  

Tags:    

Similar News