Kali Temple Crown: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ కానుకగా సమర్పించిన కిరీటం చోరీ.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు
Crown Gifted By PM Modi Stolen In Bangladesh: ప్రధాని నరేంద్ర మోదీ 2021 లో బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడ సత్కిరా అనే ప్రదేశంలో ఉన్న జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే కాళీ ఆలయంలో అమ్మవారికి బంగారం, వెండితో రూపొందించిన కిరీటం బహుకరించారు. తాజాగా ఆ కిరీటం నిన్న గురువారం చోరీకి గురవడం సంచలనం సృష్టించింది.
దసరా ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్ లో కాళీ ఆలయాల్లో జోరుగా పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న ఆలయ పూజారి పూజ ముగించుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి, అమ్మవారికి భారత ప్రధాని మోదీ బహూకరించిన బంగారు, వెండి కిరీటాన్ని చోరీ చేశారు. ఆ దృశ్యాలు కాళీ మందిరంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆందోళన వ్యక్తంచేసిన భారత ప్రభుత్వం
మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైందని తెలుసుకున్న భారత ప్రభుత్వం, వెంటనే ఫోన్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడింది. కాళీ మాత ఆలయానికి ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో బహూకరించిన కిరీటం చోరీపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. వెంటనే నిందితుడిని పట్టుకుని అతడి నుండి కిరీటం స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ జెశోరేశ్వరి కాళీ ఆలయం సందర్శనలో అమ్మ వారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. ఆ సందర్భంగా ఆలయ కమిటీ భారత ప్రధానికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు
ఈ ఘటనపై బంగ్లాదేశ్‌లోని సత్కిరా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని, నిందితుడిని పట్టుకుంటామని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు.