Pakistan: హింసాత్మకంగా మారిన ఆజాదీ మార్చ్

Pakistan: టియర్ గ్యాస్‌ షెల్స్ ప్రయోగించిన పోలీసులు

Update: 2022-05-26 03:23 GMT

Pakistan: హింసాత్మకంగా మారిన ఆజాదీ మార్చ్

Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చిన ఆజాదీ మార్చ్ హింసాత్మకంగా మారింది. పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పలు నగరాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని ఆందోళనకారులు ముందుకు రావడంతో సమీపంలో భవనాలపై ఉన్న పోలీసులు టియర్ గ్యాస్‌ షెల్స్ ప్రయోగించారు. అంతేగాక పలు రోడ్లను బ్లాక్‌ చేసి, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

ప్రధాని పదవి నుంచి బలవంతంగా తప్పుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌, వెంటనే ఎన్నికల నిర్వహించేందుకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోసం దేశంలోని పలు నగరాల నుంచి రాజధాని ఇస్లామాబాద్‌ వరకు ఆజాదీ మార్చ్ కు పిలుపునిచ్చారు. అయితే విపక్ష కూటమి నేతృత్వంలోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్‌ ఖాన్‌ డిమాండ్‌ను తిరస్కరించింది. టెర్మ్‌ పూర్తయిన తర్వాతే వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ఎజెండాను ప్రచారం చేయకుండా నిరోధించడానికి ర్యాలీని నిషేధించింది. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, కరాచీలో 144 సెక్షన్‌ విధించింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా ఉండేందుకు పారామిలిటరీ సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దించింది. పంజాబ్‌ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి నాలుగు వేలకుపైగా పోలీసులను రాజధాని ఇస్లామాబాద్‌కు రప్పించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆజాదీ మార్చ్ ను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. 

Tags:    

Similar News