టన్నెల్‌‌లో హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్.. ఐడీఎఫ్‌ వీడియో విడుదల

Video: సిన్వర్‌ను పట్టుకుని తీరుతామంటున్న డానియల్ హగారీ

Update: 2024-02-15 05:41 GMT

టన్నెల్‌‌లో హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్.. ఐడీఎఫ్‌ వీడియో విడుదల

Video:  హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వర్‌ కదలికలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ఐడీఎఫ్ గుర్తించింది. అతడు దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్‌ ప్రాంతంలో ఉన్న సొరంగాల నెట్‌వర్క్‌లోనే కుటుంబంతో సహా ఉన్నట్లు నిర్ధరించుకొంది. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ షేర్‌ చేసింది. ఇందులో అతడి భార్య, పిల్లలు, సోదరుడు ఇబ్రహీం సిన్వర్‌ కలిసి ఓ సొరంగంలో నడుచుకుని వెళుతున్నట్లుంది. సిన్వర్‌ చేతిలో ఓ బ్యాగ్‌ కూడా ఉంది. అక్టోబరు 7 నాటి దాడులకు అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది.

పాలస్తీనా ఇజ్రాయెల్‌ యుద్ధానికి అతడే ప్రధాన లక్ష్యం అని ఐడీఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారీ తెలిపారు. హమాస్‌ సొరంగాల్లోని సీసీటీవీ నుంచి ఈ దృశ్యాలను సేకరించినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం కుటుంబంతో కలిసి అతడు భూగర్భ సొరంగాల్లో ముందస్తుగానే సిద్ధం చేసుకొన్న సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడని తెలిపింది. ఇప్పటికే ఖాన్‌ యూనిస్‌లోని ఓ సమాధి కింద ఉన్న ఈ సొరంగంపై తమ బలగాలు దాడి చేశాయని డానియల్ హగారీ చెప్పారు. సిన్వర్‌ను పట్టుకొనే వరకు తమ వేట ఆగదని స్పష్టం చేశారు. డిసెంబరులో ఒక సారి సిన్వర్‌ ఇంటిని ఐడీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయి. కానీ, నాడు తప్పించుకున్నాడు. ఇప్పటికే ఐడీఎఫ్‌ వద్ద అతడికి సంబంధించిన తాజా సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో హమాస్‌ రఫా బ్రిగేడ్‌ అధిపతి కూడా ఉన్నారని హగారీ వెల్లడించారు.


Tags:    

Similar News