Hindus Safety in Canada: కెనడాలో హిందువులకు రక్షణపై భారత సంతతి ఎంపీ ఆందోళన.. ప్రధాని ట్రూడోకు విజ్ఞప్తి

Update: 2024-10-20 11:13 GMT

Hindus Safety in Canada: కెనడాలో హిందువులకు ఆపద పొంచి ఉందని అక్కడి భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తంచేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉద్యమం పేరుతో జరుగుతున్న అనేక పరిణామాలనే ఆయన అందుకు కారణంగా చూపించారు. కెనడాలో ఉంటున్న హిందువులంతా ఇప్పుడు తమ రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారని చంద్ర ఆర్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందుతున్న వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు. ఇకనైనా ఖలిస్థానీ సంఘాల నుండి హిందువులకు పొంచి ఉన్న ముప్పును గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన జస్టిన్ ట్రూడోకు విజ్ఞప్తి చేశారు.

గత వారం తాను ఎడ్మంటన్ లో జరిగిన ఒక హిందూ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడ ఖలిస్థాని సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకుని తనకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కెనడా జాతీయ పోలీసు సంస్థ అయిన రాయల్ కెనడీయన్ మౌంటెడ్ పోలీసు అధికారులే తనకు భద్రత కల్పించారని చంద్ర ఆర్య తెలిపారు. అందుకే కెనడాలో ఖలిస్థానీల నుండి హిందువులకు ప్రమాదం ఉందని చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు ఒక భారీ సందేశాన్ని కూడా జతపరిచారు.

గతేడాది జూన్ లో కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత ఆ దేశంలో హిందువులకు, ఖలిస్థానీలకు మధ్య తీవ్ర విబేధాలు నెలకున్నాయి. అదే సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ హత్య వెనుక భారత దౌత్యవేత్తల పాత్ర ఉందని ఆరోపించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.

కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. కెనడాలో పనిచేస్తోన్న తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంది. అలాగే ఇండియాలో పనిచేస్తోన్న కెనడా దౌత్యవేత్తలను కూడా దేశం విడిచివెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటికే కెనడా గడ్డపై జరుగుతున్న ఖలిస్థానీ ఉద్యమాన్ని ఆ దేశ ప్రభుత్వం పెంచిపోషిస్తోందని భారత్ ఆగ్రహంగా ఉంది. దానికితోడు తాజాగా జరుగుతున్న ఈ వరుస పరిణామాలతో ఇండియా - కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

Tags:    

Similar News