టైటానిక్‌ను మించిన భారీ నౌక.. ప్రయాణానికి ముందే తుక్కుగా మారుతోంది.. బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్ల రుణాలు

*20 అంతస్తులతో 342మీ. పొడవుతో నిర్మాణం *టైటానిక్‌ను మించిన నిర్మాణానికి వెర్ఫ్‌టెన్‌ శ్రీకారం

Update: 2022-09-20 07:30 GMT

టైటానిక్‌ను మించిన భారీ నౌక.. ప్రయాణానికి ముందే తుక్కుగా మారుతోంది.. బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్ల రుణాలు

Global Dream II: సముద్రంపై స్వర్గాన్ని చూపించాలనుకుని కలల కన్నారు. టైటానిక్‌ను మించిన.. ప్రపంచంలోనే అతి భారీ నౌకను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 11వేల కోట్ల రూపాయలను వెచ్చించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే నిర్మాణాన్ని పూర్తి చేశారు. తుదిమెరుగులు దిద్దుకుని జల ప్రవేశం చేయడమే ఆలస్యమనుకున్నారు. అప్పుడే కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం.. ఆ కలలను కల్లలు చేశాయి. జల ప్రవేశం చేయకముందే.. స్వర్గం చూపించాలనుకున్న ఆ అతి పెద్ద నౌక.. తుక్కుగా మారుతోంది. అసలు ఆ నౌక కథమేమిటి? దాన్ని దేశం నిర్మించాలనుకున్నది? ఎందుకు తుక్కుగా మారుస్తోంది?

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అతి పెద్ద నౌక టైటానిక్‌.. అందులో ఉన్నన్ని వసతులు భూమి మీదా కూడా లేవంటే అతిశయోక్తి కాదు. ఆ నౌక నిర్మించిన సమయంలో.. దానిలో ప్రయాణించడమే అదృష్టంగా భావించారు. ఎందరో ఆ నౌకలో ప్రయాణించేందుకు ఎగబడ్డారు. బాగా డబ్బున్న కోటీశ్వరులు.. నౌకలో ప్రయాణికి సిద్ధమయ్యారు. అందులో గడిపి వచ్చేందుకు తమవారి నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అలా ప్రయాణించిన ఆ విహార నౌక.. అనుకోకుండా మంచు పర్వతాన్ని ఢీకొట్టింది. చివరికి కడలిలో కూరుకుపోయింది. ఇది వందేళ్ల క్రితం జరిగిన టైటానిక్‌ షిప్‌ విషాధ గాథ. అయితే టైటానిక్‌ను మించిన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. భారీ నౌకను నిర్మించాలని జర్మనీ-హాంకాంగ్‌కు చెందిన ఎంవీ వెర్ఫ్‌టెన్‌ సంస్థ సంకల్పించింది. అందుకు 11వేల 90 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అనుకున్నదే తడువుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వరల్డ్‌ రికార్డను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని... గ్లోబల్‌ డ్రీమ్‌-2 పేరుతో భారీ షిప్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. అప్పటికే గ్లోబల్‌ డ్రీమ్‌-1 పేరుతో ఓ పెద్ద నౌకను నిర్మించిన అనుభవం ఉంది.అందుకే రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగింది. గ్లోబల్‌ డ్రీమ్‌-1 కంటే భారీ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అయితే గ్లోబల్‌ డ్రీమ్‌-2 ఎన్ని అంతస్తులతో నిర్మాణం చేపట్టారు? ఎంత మంది ప్రయాణించే సామర్థ్యం ఈ నౌకకు ఉంది?

గ్లోబల్‌ డ్రీమ్‌-2 భారీ నౌకను 20 అంతస్తులతో, 342 మీటర్ల పొడవుతో నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో భారీ వాటర్‌పార్క్‌, ఆరుబయట సిమ్మింగ్‌ పూల్‌, విశాలమైన సినిమా హాల్‌ వంటి భారీ హంగులు ఉండేలా ప్లాన్‌ వేసింది. అన్ని రకాల ఆధునిక, ఖరీదైన హంగులతో 9వేల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వెర్ఫ్‌టెన్‌ సంస్థ.. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. అందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి భారీగా రుణాలుగా తీసుకున్నది. క్రూయిజ్‌షిప్‌ నిర్మాణం దాదాపు పూర్తయ్యే సరికి 9వేల కోట్ల రూపాయలు వెచ్చింది. ఇక తుది మెరుగులు దిద్దుకుని.. సముద్ర యానానికి సిద్ధం చేయడమే ఆలస్యం.. అప్పుడే వెర్ఫ్‌టెన్‌ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకో 3వేల కోట్ల రూపాయల నిధులు అవసరం.. కానీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయాయి. బ్యాంకుల్లో మరిన్ని రుణాల కోసం ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. తుది మెరుగులు దిద్దేందుకు అవసరమైన నిధులను సమకూర్చడంలో వెర్ఫ్‌టెన్‌ సంస్థ విఫలమైంది. అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంలో చతికిలపడింది. అసలు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చిన బ్యాంకులు.. 3వేల కోట్లకు ఎందుకు నిరాకరించాయి? వెర్ఫ్‌టెన్‌ సంస్థ నిధులను సమకూర్చడంలో ఎందుకు విఫలమైంది. గ్లోబల్‌ డ్రీమ్‌-1కు ఏం కష్టం వచ్చింది?

నిజానికి గ్లోబల్‌ డ్రీమ్‌-1 నౌకను విజయవంతంగా నిర్మించింది. దాన్ని విజయవంతంగా జలాల్లోకి ప్రవేశపెట్టింది. అదే సమయలోనే గ్లోబల్‌ డ్రీమ్‌-2 నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌ డ్రీమ్‌-1ను విజయవంతం చేయడంతోనే బ్యాంకులు వెర్ఫ్‌టెన్‌ సంస్థకు నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అయితే గ్లోబల్‌ డ్రీమ్‌-2 నిర్మాణం తుది దశకు చేరుకునే సమయంలోనే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విలవిలలాడించింది. ఫలితంగా గ్లోబల్‌ డ్రీమ్‌-1 క్రూయిజ్ షిప్‌ పర్యటనలు కూడా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌, భౌతిక దూరం కారణంగా. సముద్ర పర్యాటకం నిలిచిపోయింది. డ్రీమ్‌-1 నౌకతో భారీ లాభాలు వస్తాయని భావించిన వెర్ఫ్‌టెన్‌ సంస్థకు నిరాశే ఎదుయ్యింది. పర్యాటకం పడిపోవడంతో.. క్రూయిజ్‌ షిప్‌లకు డిమాండ్‌ లేకుండా పోయింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్‌ సంస్థకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. మరోవైపు అప్పటివరకు గ్లోబల్‌ డ్రీమ్‌-2ను కొనుగోలు చేసేందుకు పోటీపడిన కంపెనీలు చెతులెత్తేశాయి. ఒకవైపు షిప్‌ అమ్ముడుకపోక.. మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో వెర్ఫ్‌టెన్‌ సంస్థ దివాళా తీస్తున్నట్టు ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించింది. ఆ తరువాత వెర్ఫ్‌టెన్‌ సంస్థకు చెందిన షిప్‌యార్డ్‌, నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన‌క్రుప్‌ అనే నావల్‌ యూనిట్‌ దక్కించుకుంది. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయింది. గ్లోబల్‌ డ్రీమ్‌-2పై యుద్ధం ఎలాంటి ప్రభావం చూపింది. తైసైన్ క్రూప్‌ వాటిని ఏం చేయాలనుకున్నది?

వెర్ఫ్‌టెన్‌ సంస్థకు చెందిన షిప్‌యార్డు, నౌకల తయారీ కర్మాగారాన్ని మాత్రమే తైసన్‌క్రుప్‌ దక్కించుకుంది. ఈ సంస్థకు గ్లోబల్‌ డ్రీమ్‌ నౌకలను విక్రయించలేదు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా వార్‌షిప్‌లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆ షిప్‌యార్డులో యుద్ధ నౌకలను తయారుచేయాలని తైసన్‌క్రుప్‌ నిర్ణయించుకుంది. అందుకు త‌గ్గ‌ట్టుగా షిప్‌యార్డ్‌లో మార్పులు చేయాలని భావించింది. అయితే అదే షిప్‌యార్డులో మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు కోసం నిలిపి ఉన్న గ్లోబ‌ల్ డ్రీమ్-1, గ్లోబ‌ల్ డ్రీమ్-2 క్రూయిజ్ షిప్‌లు అడ్డుగా ఉన్నాయి. దీంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు ఈ షిప్‌ల‌ను ఖాళీ చేసేందుకు తైస‌న్‌క్రూప్ సంస్థ 2023 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఖాళీ చేసే సమయం దగ్గర పడుతుండడం.. రుణాలను చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేయడంతో.. వెర్ఫ్‌టెన్‌ సంస్థ ఆందోళనకు గురయ్యింది. గడువులోపు గ్లోబల్‌ డ్రీమ్‌ షిప్‌ను అమ్మేయాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పటివరకు ఏ సంస్థ కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో గ్లోబల్‌ డ్రీమ్‌-2ను గడువులోగా.. ముక్కలు చేసిన... తుక్కు కింద అమ్మేయాలని వెర్ఫ్‌టెన్‌ సంస్థ నిర్ణయించింది. ఒక‌వేళ అదే జ‌రిగితే ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన క్రూయిజ్ నౌక.. తొలి ప్ర‌యాణం చేయ‌క‌ముందే క‌నుమ‌రుగు కానున్నది. వెర్ఫ్‌టెన్‌ సంస్థ కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి. టైటానిక్‌ను తలదన్నేలా నిర్మించిన ఆ నౌక.. జలప్రవేశానికి ముందే అంతం కానున్నది. భారీ నష్టం కలగకుండా కొంతైనా పూడ్చుకునేందుకు వెర్ఫ్‌టెన్‌ సంస్థ ప్రయత్నిస్తోంది.

నిజానికి అతిపెద్ద నౌక టైటానిక్‌.. జలప్రవేశం చేసి.. మంచు పర్వతాన్ని ఢీకొని.. నీటమునిగింది. కానీ.. వెర్ఫ్‌టెన్‌ సంస్థ నిర్మించిన గ్లోబల్‌ డ్రీమ్‌-2 జలప్రవేశానికి ముందే.. దాని ప్రయాణం ముగిసింది. తుక్కు సంస్థలకు చేరుతోంది. దీంతో భారీ నౌకల నిర్మాణానికి ఇక చెల్లుచీటి పడినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News