Manisha Ropeta: పాకిస్తాన్‌లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్..
Manisha Ropeta: అది కరుడుగట్టిన ముస్లిం దేశం పైగా పురుషాధిపత్య సమాజం మహిళలు ఉద్యోగం చేయాలనుకుంటే డాక్టరో, టీచరో అవ్వాల్సిందే.
Manisha Ropeta: అది కరుడుగట్టిన ముస్లిం దేశం పైగా పురుషాధిపత్య సమాజం మహిళలు ఉద్యోగం చేయాలనుకుంటే డాక్టరో, టీచరో అవ్వాల్సిందే. చదువుకోవాలంటే ఎంబీబీఎస్సే చేయాల్సి ఉంటుంది. వేరే కోర్సులకు అనుమతించరు. ఎంబీబీఎస్ ఫెయిల్ అయితే మరో కోర్సు చేసే అవకాశం ఆ దేశంలో లేదు. అంతే కాదు అక్కడ ముస్లిం మహిళలకే పోలీసు ఉద్యోగాలకు అనుమతించరు. అలాంటి కఠిన ముస్లిం దేశంలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ హిందూ మహిళ పోలీసు ఉద్యోగం సాధించడమంటే మామూలు విషయం కాదు ఆ ఉద్యోగం కూడా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అంటే అద్భుత ఘట్టమే కలలో కూడా ఊహించని పోస్టును మనీషా రూపేట సాధించింది. మన దాయాది దేశం పాకిస్థాన్‌లో రికార్డులకెక్కింది.
పొరుగు దేశం పాకిస్థాన్‌లో హిందువుల భవితే ప్రశ్నార్థకంగా మారుతోంది. పాక్ సమాజంలో హిందువులను చిన్నచూపు చూస్తారు. ఒకప్పుడు గణనీయంగా ఉండే హిందువులు ఇప్పుడు కేవలం 2 శాతానికే పడిపోయారు. మతమార్పిడులు, కిడ్నాపులతో హిందువులను వేధిస్తున్నారు. అక్కడి హిందూ దేవాలయాలను కూల్చేస్తున్నారు. అలాంటి దేశంలో పోలీసు శాఖలో అత్యున్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని 26 ఏళ్ల మనీషా రూపేట దక్కించుకుంది. సింధ్‌కు సమీపంలోని జాకోబాబాద్ పట్టణానికి చెందిన మనీషా సహజంగానే ఎంబీబీఎస్ కోసం ప్రయత్నించింది. అయితే ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదు. దీంతో ఆమె ఫిజికల్ థెరపీ కోర్సును ఎంపిక చేసుకుంది.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రోపేటా తండ్రి వ్యాపారి. అయితే ఆమె 13వ ఏటనే తండ్రి మరణించడంతో తల్లి కుటుంబాన్ని కరాచీకి తీసుకువచ్చి పిల్లలను పెంచించింది. మనీషాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే ముగ్గురు అక్కలు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తమ్ముడు కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మనీషా మాత్రం వినూత్నంగా పోలీసు శాఖ వైపు మొగ్గు చూపింది. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ నిర్వహించిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచి మనీషా రోపేటా రికార్డు సృష్టించారు. హింస, నేరాలు అధికంగా ఉండే లియారీ ప్రాంతంలో ప్రస్తుతం మనీషా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారిగా పని చేయడం నిజంగా మహిళలకు ఎంతో శక్తిని, ప్రోత్సామాన్ని ఇస్తుందని మనీషా భావిస్తోంది.
తాను హిందూ సమాజానికి మాత్రమే ప్రతినిధిని కాదని జీవితంలో ఏదైనా సాధించాలని తపించే ప్రతి అమ్మాయికి ప్రతీకగా నిలుస్తానని మనీషా రూపేట చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా పెద్ద పెద్ద కలలు ఉంటాయని శ్రమిస్తే అవి సాధ్యమేనంటున్నారు మనీషా. బలవంతపు మతమార్పిడులు, అమ్మాయిల కిడ్నాప్ వంటి వ్యవహారాలు మతపరమైన అంశాలు కాదని అదొక సాంఘిక సమస్యగా మారిందన్నారు. పోలీసు ఆఫీసరుగా ఎంపిక కాకముందు ఓ ప్రైవేటు అకాడమీలో మనీషా ఇంగ్లీషు పాఠాలు బోధించేది. తాను సాధించిన ఉద్యోగంతో మరింత మంది మహిళలు తన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నది మనీషా రూపేట. ఏదేమైనా పాకిస్థాన్‌లో ఓ ఉన్నత పదవికి హిందువు ఎంపికవ్వడం మాత్రం ఇదే తొలిసారి.