ముగిసిన చివరి అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్.. కరోనాపై ట్రంప్,బైడెన్ మధ్య వాడీవేడీ చర్చ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకుంది. నాష్‌విలేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ మధ్య చివరి ముఖాముఖి చర్చ జరిగింది. అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు ట్రంప్. కొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆర్మీ సాయంతో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ట్రంప్ తెలిపారు. త్వరలోనే విద్య, వ్యాపార సంస్థలను తెరుస్తామన్నారు. 99 శాతం అమెరికా ప్రజలు వైరస్ నుంచి కోలుకున్నారన్న ట్రంప్ కరోనాకు చైనానే కారణమని స్పష్టం చేశారు.
కరోనాను నివారించడంలో ట్రంప్ విఫలమయ్యారని అన్నారు బైడెన్. కరోనాను ఎదుర్కోవడానికి ట్రంప్ దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని కరోనా కేసుల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండడానికి ట్రంప్ నిర్లక్ష్యమే కారణమన్నారు. కరోనా సోకిన ట్రంప్ మాస్క్‌ను కూడా చులకనగా చూశారని విమర్శించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా గురించి ట్రంప్ పట్టించుకోలేదని చైనాకు రాకపోకలు నిషేధించడంలో ఆలస్యం వహించారని మండిపడ్డారు బైడెన్.