కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం చైనాను కంగారులో పడేసింది. ఇలా తనకు మోకాలడ్డుతున్న దేశాలు పెరుగుతుండటంతో అసహనం వ్యక్తం చేస్తోంది. తన నక్కజిత్తులకు కళ్లెం వేయటంతో డ్రాగన్ కోరలు చాస్తోంది. భారత్ విధానం స్వేచ్ఛా వాణిజ్య స్ఫూర్తికి విఘాతకరమని సుద్దులు చెబుతోన్న చైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతోంది.
కరోనా ఎఫెక్ట్ కి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటంతో దేశీయ కంపెనీల ఒడిదుడుకులను ఆసరగా తీసుకోకుండా FDI పాలసీకి సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు పాకిస్థాన్ కు వరకే పరిమితమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆంక్షలు తాజాగా సరిహద్దు దేశాలన్నింటికీ వర్తింపజేసింది. దేశీయంగా బ్యాంకింగేతర రుణ సంస్థల్లో పెద్దదైన HDFCలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఈ సవరణ నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్, భూటాన్‌లకూ వర్తిస్తున్నా చైనా మాత్రం గుర్రుమంటోంది.
ఇండియాలోని 18 అగ్రశ్రేణి స్టార్టప్ కంపెనీల్లో చైనా పెట్టుబడులు 30వేల కోట్లు దాటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. బ్రూకింగ్స్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోని మొబైల్స్, నిర్మాణ పరికరాలు, స్థిరాస్తి, ఆటోమొబైల్ లాంటి ఎన్నో రంగాల్లో చైనా సంస్థలు పెట్టుబడులు గుమ్మరిస్తూనే ఉన్నాయి. భారత్ లో పెట్టుబడులు పెట్టిన సంస్థల సంఖ్య 800 లకు పైబడిందంటే చైనా ఆధిపత్య వ్యూహం చాపకింద నీరులా ఎలా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి విజృంభించటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలై ఎన్నో దేశాలు తలకిందులవుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నో చైనా సంస్థలు విదేశాల్లో వాటాలు పెంచుకోవడానికి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా FDI నిబంధనలు సవరించగా జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు స్పెయిన్, జర్మనీ లాంటి ఐరోపా దేశాలూ నిషేధాంక్షలు విధించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. దీంతో చైనాలో అసహనం పెరిగి తనకు వ్యతిరేకంగా మారుతోన్న దేశాలపై విషం చిమ్ముతోంది.
ఎఫ్‌డీఐ సవరణలు ప్రపంచ వాణిజ్య సంస్థ సిద్ధాంతాలకు విరుద్ధమంటూ చైనా చేసిన ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రపంచాన్ని గుప్పిట పెట్టుకోవాలన్న ఆలోచనతో చైనా డబ్ల్యూటీఓ నిబంధనలకు ఎన్నో సార్లు తూట్లు పొడిచిందన్నారు. చౌక సరుకులతో భారత తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్న చైనా సిద్ధాంతాలకు లోబడే వ్యాపారం చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌డీఐ నిబంధనలు డబ్ల్యూటీఓ పరిధిలో లేవని, భారత్ విధాన నిర్ణయంలో తప్పిదం లేదని చెబుతున్నారు.