Elon Musk: చర్చనీయాంశంగా మస్క్ శాంతి ప్రతిపాదన.. ట్విట్టర్‌లో ఉక్రెయిన్ శాంతికి సూచనలు
Elon Musk: పుతిన్‌తో మాట్లాడిన తరువాతే ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినట్టు ప్రచారం
Elon Musk: ఉక్రెయిన్ యుద్దం రోజు రోజుకు మరింత తీవ్రమవుతోంది. యుద్దం తొలినాళ్లలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజా పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య మార్గంలో ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ కోరింది. చర్చలకు అవసరమైతే సహకరిస్తామని కూడా సూచించింది. భారత్ పిలుపును పలు దేశాలు స్వాగతించాయి. కానీ.. ఇటీవల శాంతి ప్రతిపాదనలతో ముందుకొచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తాజాగా ఆయనపై మరో ఆరోపణ బయటికి వచ్చింది. శాంతి ప్రతిపాదనలు ట్వీట్ చేయకముందే.. పుతిన్‌తో ఎలాన్ మస్క్ ఫోన్‌లో మాట్లాడారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని ప్రపంచ కుబేరుడు మస్క్ మాత్రం తోసి పుచ్చారు.
అయితే ఎలాన్ శాంతి ప్రతిపాదనను ట్విటర్‌లో పోస్ట్ చేయడానికి ముందే... పుతిన్‌తో మాట్లాడారంటూ పలు కథనాలు బయటికొచ్చాయి. రాజకీయ కన్సల్టెన్సీ యూరోసియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమ్మర్ తమ సబ్‌స్క్రైబర్లకు ఓ మెయిల్ రాశారని.. అందులో మస్క్ ప్రతిపాదనలను ప్రస్తావించినట్టు వైస్ అనే అంతర్జాతీయ మీడియాసంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్టు మస్క్.. బ్రెమ్మర్‌తో చెప్పినట్టు వివరించింది. అందుకు పుతిన్ కొన్ని షరతులు విధించినట్టు తెలిపింది. క్రిమియా ఎప్పటికీ రష్యాతోనే ఉండాలని.. ఉక్రెయిన్ తటస్థ స్థితిని కొనసాగించాలని, విలీన ప్రాంతాలను రష్యా భూభాగంగా గుర్తించాలని మస్క్‌తో పుతిన్ డిమాండ్ చేసినట్టు బ్రెమ్మర్‌కు చెప్పారట. ఉక్రెయిన్ అందుకు అంగీకరించకపోతే.. అణుదాడి తప్పదంటూ మస్క్‌తో పుతిన్ చెప్పారంటూ వైస్ కథనం చెబుతోంది. అణు దాడి జరగకుండా ఆపేందుకు.. మస్క్ ఏదైనా చేయాలనుకుంటున్నాని బ్రెమ్మర్‌కు చెప్పారట.
అయితే వైస్‌లో వచ్చినకథనంతో మస్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మళ్లీ మస్క్ స్పందించారు. వైస్ కథనం నిజం కాదని.. తాను పుతిన్‌తో ఒకేసారి మాట్లాడానని.. అది కూడా 18 నెలల క్రితమని వెల్లడించారు. అప్పట్లో తాను పుతిన్‌తో అంతరిక్షం గురించి చర్చించినట్టు తెలిపారు., అయితే నెటిజన్లు మాత్రం మస్క్ వాదనలను ఖండిస్తున్నారు. టెస్లా అధినేత అబద్ధం చెబుతున్నాడంటూ మండిపడుతున్నారు. మస్క్ శాంతి ప్రతిపాదనలను కూడా పలువురు వ్యతిరేకించారు. అయితే దానికి కూడా మస్క్ వివరణ ఇచ్చారు. తాను మొదటి నుంచి ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నానని తెలిపారు. అయితే ఉక్రెయిన్ రోజు రోజుకు తీవ్రంగా ధ్వంసమవుతోందని.. అందుకే ఆ ప్రతిపాదన చేశానన్నారు.
ఇటీవల ఉక్రెయిన్ యుద్ధంపై ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉక్రెయిన్ భూభాగంలోని రష్యా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి-యూఎన్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని మస్క్ ప్రతిపాదించారు. అక్కడి ప్రజలకు ఇష్టమైతే.. ఆ ప్రాంతాలు రష్యాకు చెందుతాయని సూచించారు. 2014లో మాస్కో స్వాధీనం చేసుకున్న క్రిమియాను అధికారికంగా రష్యా ప్రాంతంగా గుర్తించాలని.. క్రిమియాకు నీటి సరఫరాకు హామీ ఇవ్వాలని మస్క్ ప్రతిపాదించారు. నాటో, ఐరోపా కూటమిలోనూ చేరకుండా ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలన్నారు. ఈ ప్రతిపాదనలో అవును, కాదు అనే ఆప్షన్లను ఎంచుకోవాలంటూ ట్విట్టర్ లో కోరారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదననే రష్యా కూడా చేసింది. ఇప్పటికే ప్రజాభిప్రాయం పేరిట.. జపోరిజ్జియా, ఖేర్సన్ , లుహాన్ స్క్, డొనెట్ స్క్ ప్రాంతాల్లో రష్యా ఓటింగ్ నిర్వహించింది. ఆ మేరకు అక్కడి ప్రజలు రష్యాలో చేరికకు అంగీరించారని మాస్కో తెలిపింది. నాలుగు ప్రాంతాలు తమ దేశంలో విలనీమైనట్టు క్రెమ్లిన్ స్పష్టం చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎలాన్ మస్క్ .. రష్యా వైపు ఉంటారో.. లేక ఉక్రెయిన్ వైపు ఉంటారో తేల్చుకోవాలంటూ జెలెన్ స్కీ కూడా ఆప్షన్లను ఇచ్చారు. ఇదే కాకుండా.. ఇటీవల చైనా, తైవాన్ మధ్య కూడా ఇలాంటి ఓ ప్రతిపాదనను మస్క్ చేశారు. దీనిపై చైనా హర్షం వ్యక్తం చేయగా, తైవాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.