Delta Plus Variant: మళ్లీ మాస్కుల దిశగా కదులుతున్న దేశాలు
Delta Plus Variant: ప్రపంచం నో మాస్క్ దిశగా అడుగులేస్తున్న వేళ థర్డ్ వేవ్ తయారైంది.
Delta Plus Variant: ప్రపంచం నో మాస్క్ దిశగా అడుగులేస్తున్న వేళ థర్డ్ వేవ్ తయారైంది. కొన్ని చోట్ల డెల్టా వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఊహించినదానికన్నా వేగంగా డెల్టా ప్లస్ దేశాల్ని చుట్టేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ వేగంగా సాగుతున్నా అంతకన్నా వేగంగా డెల్టా దడదడలాడించడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. రెండు నెలల క్రితం నుంచి నో మాస్క్ దిశగా ప్రయాణిస్తున్న దేశాలన్నీ ఇప్పుడు మళ్లీ మాస్క్ మస్ట్ అని ప్రకటనలివ్వాల్సి వస్తోంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఆఫ్రికా, ఫిజీ దేశాలన్నీ మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. సిడ్నీలో ఇప్పటికే వారం పాటు లాక్ డౌన్ విధించారు. ఒకవారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది.
ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇజ్రాయెల్ లో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్‌లో కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.