విశ్వ వ్యాప్తంగా కరోనా కోరలు చాచుతోంది. ఈ మహమ్మారి విషపు కోరల్లో చిక్కుకొన్ని ప్రపంచమంతా విల విలలాడిపోతుంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా కరోనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా వందలాది మంది భారతీయులు లండన్‌లో చిక్కుకుపోయారు.
లండన్ సమీపంలోని టిల్బరీ పోర్టులో నిలిపి ఉంచిన ఎంవీ ఆస్టోరియాతో పాటు మరో నాలుగు క్రూయిజ్ నౌకల్లో దాదాపు 1,500 మంది భారతీయ క్రూయిజ్ సిబ్బంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారు.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు ఓ లేఖ రాశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో సుమారు 90 రోజులుగా తాము సముద్ర జలాల్లోనే ఉండాల్సి వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. తమను స్వదేశానికి తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రికి రాసిన ఓ లేఖలో వారు అభ్యర్థించారు.