కరోనాకు ఏడాది పూర్తి.. ఏడాదిలో 219 దేశాలకు విస్తరించిన వైరస్
చైనాలోని హుబెయ్ ప్రావిన్సులో 2019 నవంబర్ 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసింది. అయితే చైనాలో 2019 డిసెంబర్ 8న కరోనా తొలికేసు వచ్చిందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వెలుగుచూసి నేటితో ఏడాది పూర్తయ్యింది. దాదాపు ఒక్క ఏడాదిలోనే 219 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని గడగడలాడించి, అన్ని వర్గాల వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న ఈ వైరస్ బయటపడి.. ఏడాది పూర్తవుతోంది. ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి.
చైనాలోని హుబెయ్ ప్రావిన్సులో 2019 నవంబర్ 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసింది. అయితే చైనాలో 2019 డిసెంబర్ 8న కరోనా తొలికేసు వచ్చిందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కరోనా వెలుగుచూసిన సమయంలో రోజుకు ఐదు కేసులు వచ్చేవి. డిసెంబర్15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. అయితే చాలా మంది వైద్యులు అవన్నీ మామూలు వైరస్ కేసులేనని అనుకున్నారు. కానీ డిసెంబర్ 27న హుబెయ్‌లోని ఓ డాక్టర్ ఇవన్నీ కొత్తరకం కరోనా వైరస్ అని గుర్తించారు.
వుహాన్‌లో ఈ ఏడాది జనవరిలో కరోనా మహమ్మారి తీవ్రత వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని దేశాలకు ఈ వైరస్ పాకింది. కరోనా కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు విధించాయి. ఇప్పటి వరకు 5.50 కోట్ల మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. 2019లో కరోనా బారిన పడిన 266 మందిని చైనా గుర్తించింది. వీరందరూ చికిత్స పొందారు. తర్వాత యావత్ ప్రపంచం కరోనా పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది.