కీలక దశల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేయటంతో.. కోవాగ్జిన్ 3వ దశ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది.
ప్రపంచమంతా కరోనా టీకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ విషయంలోనూ రోజుకో ముందడుగు వేస్తుండగా.. తాజాగా వెలువడుతోన్న క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. మూడో దశ ప్రయోగాలకు 11 సంస్థలు సిద్ధమవటంతో.. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచమంతా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కరోనాను అరికట్టేందుకు భారత్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న కోవాగ్జిన్ మూడవ దశ ప్రయోగాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేయటంతో.. కోవాగ్జిన్ 3వ దశ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ప్రయోగాల కోసం హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి వాలంటీర్‌గా నమోదు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
మరోవైపు కరోనా టీకా కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ శుభవార్త చెప్పింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించిన ఫైజర్.. తమ టీకా 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయస్సుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని వెల్లడించింది. 65 ఏళ్ల పైబడిన వారిలోనూ వ్యాక్సిన్ సమర్థత 94 శాతానికి పైగా ఉన్నట్టు చెబుతోంది.
ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు భారత్‌లో ప్రయోగాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే వాలంటీర్ల ఎంపిక పూర్తి చేశారు. రెండు, మూడో దశ ప్రయోగాలను కాన్పూర్‌లో జరిపేందుకు ఏర్పాట్లు పూర్తవగా.. వచ్చే వారంలోగా వ్యాక్సిన్ డోసులు కాన్పూర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం దాదాపు 180 మంది వాలంటీర్ల ఎంపిక పూర్తయ్యింది. వీరికి తొలుత ఒక డోసు వ్యాక్సిన్ అందిస్తారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాత మరో డోసు ఇవ్వాలా? లేదా? అనే విషయాన్ని నిపుణులు నిర్ణయించనున్నారు. ప్రతినెలా వ్యాక్సిన్ పనితీరును అంచనా వేస్తూ నివేదికలు రూపొందించనున్నారు.
ఇక ఇప్పటికే కరోనాను నిరోధించటంలో తమ టీకా 94.5 శాతం సమర్థత ప్రదర్శించినట్లు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా ఇంక్ వెల్లడించింది. ఇలా వరుసగా ఒక్కో సంస్థ తమ టీకాల అప్‌డేట్స్ ఇస్తుండటంతో ప్రపంచమంతా త్వరలోనే ఓ గుడ్‌న్యూస్ వింటామనే ఆశాభావంతో ఎదురుచూస్తోంది.