Colombia: భారత్‌కు రానున్న 60 నీటి గుర్రాలు

Cocaine Hippos: దేశంలో కనుమరుగుతున్న జంతువులపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2023-04-01 15:30 GMT

Colombia: భారత్‌కు రానున్న 60 నీటి గుర్రాలు

Cocaine Hippos: దేశంలో కనుమరుగుతున్న జంతువులపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల ఆఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఈ కోవలోకి నీటి గుర్రాలు చేరాయి. తాజాగా 60 నీటి గుర్రాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ సిద్ధమైంది. అందుకు దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుంది. ఈ ఆపరేషన్‌ కింది 35 లక్షల డాలర్లను మోడీ ప్రభుత్వం వెచ్చించనున్నది. మన కరెన్సీలో చెప్పాలంటే.. 28 కోట్ల 76 లక్షల రూపాయలన్న మాట. కొలంబియాలోని అస్టాక్‌ అభయారణ్యం ఆధ్వర్యంలో.. నీటి గుర్రాల తరలింపు ప్రత్యేక ఆపరేషన్‌ను త్వరలోనే చేపట్టనున్నది. వాటిని ప్రత్యేక డబ్బాల్లో ఉంచి.. భారత్‌కు విమానాల్లో తరలించనున్నారు. మొత్తం 150 నీటి గుర్రాల్లో సగానికి పైగా విక్రయించేందుకు కొలంబియా సిద్ధమైంది. 60 నీటి గుర్రాలను భారత్‌, 10 నీటి గుర్రాలను మెక్సికో కొనుగోలు చేశాయి.

నిజానికి ఈ హిప్పోలు ఆఫ్రికా ఖండానికి చెందినవి. 1980ల్లో కొలంబియాకు చెందిన డ్రగ్‌ డాన్‌.. పాబ్లో ఎస్కోబార్‌ ఆఫ్రికా నుంచి కొలంబియాకు తీసుకొచ్చాడు. డ్రగ్‌ డాన్‌కు జంతువులంటే అత్యంత ఇష్టం. ఈ క్రమంలోనే పలు రకాల జంతువులను అతడు సేకరించారు. ఈక్రమంలో నీటి గుర్రాలను కూడా ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు. అయితే 1993 డిసెంబరు 3న పాబ్లో ఎస్కోబర్ మరణించాడు. దీంతో అతడి జంతువులకు స్వేచ్ఛ‍లభించింది. ఇతర జంతువులను కొలంబియా ప్రభుత్వం తరలించింది. నీటి గుర్రాలను మాత్రం వదిలేసింది. ఎందుకంటే.. వాటిని తరలించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. వాటిని అలా వదిలేయడంతో 1993లో 70 ఉన్న నీటి గుర్రాల సంఖ్య.. ఇప్పుడు 150కి చేరింది. అయితే వాటి సంఖ్యను అరికట్టాలని కొలంబియా అభయారణ్య అధికారులు భావించారు. అందుకు గర్భ నిరోధక పద్దతులను ఆశ్రయించారు. కానీ వాటి సంఖ్యను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో సగానికి పైగా నీటి గుర్రాలను వదిలించుకోవాలని కొలంబియా యోచిస్తోంది.

ఎస్కోబార్ మరణం తరువాత.. నీటి గుర్రాలు తప్పించుకు తిరుగుతున్నాయి. నాటి నుంచి మగ్దలీనా నదిలో అవి యథేచ్ఛగా తిరుగుతున్నాయి. నీటి గుర్రాల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని అధ్యయనాలు హెచ్చరించాయి. ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్య దేశాల్లో కొలంబియాలోని మాగ్దలీనా నది అతి పెద్దది. అయితే ఈ నీటి గుర్రాలు నదుల్లోని ఆక్సిజన్‌ స్థాయిలను భారీగా తగ్గిస్తాయి. అంతేకాకుండా. వ్యర్థాలను పెంచుతాయి. దీంతో నదుల్లో నీరు కలుషితమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొలంబియా పర్యావరణ శాఖ.. హిప్పోలను ఆక్రమణ జాతిగా గతేడాది ప్రకటించింది. వాటి సంఖ్యను నియంత్రించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటిని అలాగే వదిలేస్తే.. 2034 నాటికి నీటి గుర్రాల సంఖ్య 14వందలకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిజానికి వాటిని అదుపు చేసేందుకు... ఒక సంరక్షుడిని ఏర్పాటు చేయాలి. కానీ కొలంబియా ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది.

నీటి గుర్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పర్యావరణానికి హాని కలగడంతో పాటు.. సామూహిక చేపల మరణానికి కారణమవుతున్నాయి. అంతేకాదు... మగ్దలీనా నది పరీవాహక ప్రాంత ప్రజలను అవి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలపై తరచూ దాడులకు దిగుతున్నాయి. ఇటీవల కాలంల వాటి దాడులు మరింత పెరిగినట్టు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిప్పోలను సంరక్షించడం ఓకే.. తమ ప్రాణాలు అంతకన్నా ముఖ్యమని... తమను కాపాడాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హిప్పోలతో పర్యావరణంతో పాటు స్థానికులకు కూడా ఇబ్బందిగా మారడంతో... కొలంబియా ప్రభుత్వం వాటిని వదిలించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా.. అడిగిన దేశానికి అడిగనన్ని ఇచ్చేస్తోంది. వాటిని తరలించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ కావడంతో.. ఏ దేశాలు వాటిని తీసుకెళ్లేందుకు ముందుకు రావడంలేదు. అయితే తాజాగా భారత్‌, మెక్సికో దేశాలు వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించాయి.. దీంతో కొలంబియా హమ్మయ్యా... అని ఊపిరి పీల్చుకుంది.

Tags:    

Similar News