డ్రాగన్ కంట్రీ మళ్లీ తన వక్రబుద్ధి చూపుతోంది. హద్దులు దాటి భూభాగాలను ఆక్రమించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో సైనిక స్థావరాలను పెంచి కుయుక్తులు పన్నుతోంది. తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు నక్కజిత్తులు ప్రదర్శిస్తోన్న చైనా వ్యవహారాన్ని బట్టబయలు చేశాయి.
తరచుగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించే చైనా ఈసారి ఏకంగా భారత్ పొరుగుదేశమైన భూటాన్‌లో ఓ గ్రామాన్నే నిర్మించింది. ఈ గ్రామానికి పంగ్డా అని పేరు పెట్టిన చైనా గ్రామానికి రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించింది. పంగ్డాలో సైనిక స్థావరాలు, బంకర్లు, ఆయుధాల నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో సరిహద్దుల్లో మరింత నిఘా పెంచొచ్చని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది.
భూటాన్ మాత్రం తమ భూభాగంలో చైనా ఎలాంటి నిర్మాణాలు చేయలేదని చెబుతోంది. అయితే భూటాన్ చైనాకు భయపడి ఎలాంటి విషయాలు వెల్లడించటం లేదని అభిప్రాయపడుతున్నారు రక్షణ రంగ నిపుణులు. భూటాన్‌లో చైనా నిర్మించిన గ్రామం నుంచి దేశంలోకి చొరబాట్లు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.