Cockroach: ముక్కులో దూరిన బొద్దింక.. అక్కడి నుండి గొంతులోకి.. ఆ తరువాత ఏమైందంటే..

Update: 2024-09-10 06:38 GMT

Man inhaled Cockroach: సాధారణంగా మనం నివసించే ప్రాంతాల్లో పురుగులు, బొద్దింకలను చూసినప్పుడు ఎవరికైనా ఒకరకమైన కంపరం కలుగుతుంది. ఇంకొంతమందికి వాటిని చూస్తే జుగుస్పాకరంగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. ఎందుకంటే శాస్త్రీయంగానూ పురుగులు, బొద్దింకలు ఉండే చోటు అక్కడుండే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. మరి బొద్దింకలను చూస్తేనే చీదరించుకునే వారికి నిజంగానే జరిగిన ఈ వార్త ఇంకెంత ఒళ్లు జలదరించేలా చేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి.

చైనాలోని హెనన్ ప్రావిన్స్ కి చెందిన హైకో అనే వ్యక్తికి ఎదురైన ఎదురైన విచిత్రమైన చేదు అనుభవం ఇది. హైకౌ ఆదమరిచి నిద్రిస్తున్న వేళ అతడి ముక్కులోకి బొద్దింక దూరింది. అతడు కూడా గాఢనిద్రలో ఆ బొద్దింక తన ముక్కులోపలికి వెళ్లిన విషయం గుర్తించలేకపోయారు. తరువాత నిద్రలేచిన హైకౌ ఏదో ఒక రకమైన అసౌకర్యానికి గురయ్యారు. ముక్కులో ఏదో పాకుతున్నట్లుగా అతడికి అనిపించింది. కానీ అదేమీ పట్టించుకోకుండా అతడు తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఆ తరువాత ఆ బొద్దింక ముక్కులోంచి గొంతులోకి జారింది. గొంతులో, ముక్కులో ఏదో తెలియని అసౌకర్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. హైకౌ ఆ లక్షణాలను పట్టించుకోలేదు. యధావిధిగా మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు.

ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ హైకౌలో అసౌకర్యం పెరిగిపోసాగింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, నోట్లోంచి దుర్వాసన రావడం, దగ్గు రావడం వంటివి హైకౌని తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. దీంతో ఇక చేసేదేం లేక అతడు డాక్టర్ వద్దకు వెళ్లారు. హైకౌకు సిటి స్కాన్ చేసిన డాక్టర్స్.. ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అతడి శ్వాసనాళంలో బొద్దింక ఉన్నట్లుగా డాక్టర్స్ గుర్తించారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడికి సర్జరీ మొదలుపెట్టారు. అప్పటికే ఆ బొద్దింక అతడి శరీరంలోకి వెళ్లి 3 రోజులు కావడంతో అది క్రమక్రమంగా ముక్కలై కుళ్లిపోవడం మొదలైంది. ఒక గంటసేపు శ్రమించి శ్వాసనాళంలో చిక్కుకున్న బొద్దింకను, దాని మూలాలను లేకుండా వెలికితీశారు. అదృష్టవశాత్తుగా డాక్టర్స్ ఈ సర్జరీని అతడి ప్రాణాలకు హాని లేకుండా విజయవంతంగా పూర్తిచేశారు. అందువల్లే అతడి నోట్లోంచి దుర్వాసన రావడం మొదలైందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందలు తలెత్తాయని అతడికి సర్జరీ చేసిన డాక్టర్స్ తెలిపారు.

హైకౌకు సర్జరీ చేసిన డాక్టర్ లింగ్ లింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితం మొత్తంలోనే ఇలా బొద్దింక ముక్కులో దూరం అనేది ఇదే మొదటి కేసు అని అన్నారు. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని.. లేదంటే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

ముక్కులో బొద్దింక దూరిన ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హైకౌని చూసి జాలిపడితే.. ఇంకొంతమంది వేళాకోళంగా జోకులేసుకున్నారు. మరికొంతమంది విచిత్రమైన సందేహాలు వ్యక్తంచేశారు. ఒకవేళ అప్పటికే ఆ బొద్దింక అతడి ముక్కులోనో, శ్వాసనాళంలోనో గుడ్లు పెట్టి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించిన వాళ్లు కూడా ఉన్నారు. ఏమో.. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ఆ మూడు రోజుల్లో ముక్కులో, గొంతులో కలియదిరిగిన ఆ బొద్దింక లోపలేం చేసిందో ఎవరు చూడబోయారు అనే కామెంట్స్ కూడా కనిపించాయి. ఈ చైనా వాళ్లకే ఇలాంటి ఇబ్బందులు ఎందుకొస్తాయో అర్ధం కాదనేది ఇంకొకరి సందేహం. 

Tags:    

Similar News