మరో వార్‌షిప్‌ను ప్రారంభించిన చైనా.. యుద్ధ నౌకకు ఫుజియన్‌గా నామకరణం

*80వేల టన్నుల బరువు రవాణా *చైనా నిర్మించిన వార్‌షిప్‌లో ఇది మూడోది

Update: 2022-06-18 11:24 GMT

మరో వార్‌షిప్‌ను ప్రారంభించిన చైనా.. యుద్ధ నౌకకు ఫుజియన్‌గా నామకరణం

China: తైవాన్‌ను కబలించేందుకు డ్రాగన్‌ కంట్రీ వ్యూహాలకు వేగంగా పదును పెడుతోంది. తాజాగా మరో అత్యాధునిక వార్‌షిప్‌ ఫుజియన్‌ను చైనా పీపుల్స్‌ ఆర్మీకి అప్పగించింది. తాజాగా ఫుజియన్‌ వార్‌షిప్‌ ఆవిష్కరణ వేడుకలను షాంఘైలో ఘనంగా నిర్వహించింది. ఈ వార్‌షిప్‌ దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు సృష్టిస్తున్న డ్రాగన్‌ కంట్రీ ఫుజియన్‌ వార్‌షిప్‌తో తైవాన్‌పై మరోసారి ఒత్తిడి పెంచింది.

షాంఘైలోని జియాంగ్‌నన్‌ షిప్‌యార్డులో అత్యాధునిక వార్‌షిప్‌ను చైనా ప్రారంభించింది. ఫుజియన్‌గా పేరు పెట్టిన ఈ యుద్ధ నౌక 80వేల టన్నుల బరువును తీసుకెళ్లగలదు. చైనా నిర్మించిన వార్‌షిప్‌లో ఇది మూడోది అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాప్ట్ కేరియర్‌ వార్‌షిప్‌ నిమిట్జ్‌కు, ఫుజియన్‌కు దగ్గరి పోలికలు ఉన్నట్టు చైనా మీడియా తెలిపింది. అయితే అమెరికాకు చెందిన నిమట్జ్‌ వార్‌షిప్‌ను మొత్తం కాపీ కొట్టినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా పవర్‌పుల్‌ యుద్ధ నౌకలకు ఫుజియన్‌ సవాల్‌ విసురుతుందని చైనా చెబుతోంది. చైనా యుద్ధ నౌక ఎయిర్‌క్రాఫ్ట్‌లను అత్యంత వేగవంతంగా ప్రయోగించలదు. అంతేకాదు భారీగా యుద్ధ నౌకలు, ఆయుధాలను, మందుగుండు సమగ్రిని కూడా తరలిస్తుంది. జలాలపై అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా చైనా దీన్ని రూపొందించింది.

తాజా చైనా యుద్ధ నౌక పేరును ఫుజియాన్‌ అనే పేరు పెట్టడం వెనుక కూడా కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ చైనా సముద్ర తీరంలోని ఫుజియన్‌ ప్రావిన్స్‌ ఉంటుంది. ఫుజియన్‌కు తైవాన్‌ మధ్య 128 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ తైవాన్ ఆక్రమణకు చైనా పూనుకుంటే ఈ ఫుజియన్‌ ప్రావిన్స్‌ కీలక పాత్ర పోషించనున్నది. ఈ నేపత్యంలో కొత్త యుద్ధ నౌకకు ఫుజియన్ పేరు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. తైవాన్ ఆక్రమణకు ఫుజియన్‌తో బలమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తైవాన్‌పై యుద్ధం తప్ప మరే ఆప్షన్‌ లేదని ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన షాంగ్రీ-లా చర్చల్లో చైనా రక్షణ శాఖ మంత్రి వేయ్ ఫింగే హెచ్చరించారు. చైనా నుంచి తైవాన్‌ను దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే యుద్ధానికి వెనుకాడేది లేదని ఎంతకైనా సిద్ధమని తెలిపారు. చైనా ముందు ఉన్న ఒకే ఒక్క అవకాశం అందేనని స్పష్టం చేశారు. తైవాన్‌ స్వాతంత్రం అనే పిచ్చి ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు.

తైవాన్ చైనా అంతర్భాగమని బీజింగ్‌ వాదిస్తోంది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని పదే పదే చైనా నిరసిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల ప్రకారం కూడా తైవాన్‌ తమ జలాల్లో ఉందని చైనా చెబుతోంది. తైవాన్‌ జలాల్లోకి విదేశీ నౌకలు తమ అనమతి లేకుండా వస్తే చర్యలు తప్పవని బీజింగ్‌ హెచ్చరిస్తోంది. తైవాన్ జలాల్లో అమెరికా నౌకల కార్యకలాపాలను ఆపకపోతే బ్లాక్ చేస్తామంటూ బీజింగ్‌ హెచ్చరిస్తోంది. తైవాన్‌ తమ ఆర్థిక జోన్‌ పరిధిలో ఉందని స్పష్టం చేస్తోంది. ఇటీవల తైవాన్‌ విషయంలో చైనా గొంతు పెంచుతోంది. తైవాన్‌ సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. భారీగా సైనిక విన్యాసాలను చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. దీంతో అటు అమెరికాలోనూ, ఇటు తైవాన్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

తైవాన్‌ విషయంలో అమెరికా సీరియస్‌గా ఉంది. తైవాన్‌పై దాడికి దిగితే అమెరికా సైన్యం యుద్ధానికి దిగుతుందని బైడెన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో రష్యా ఎలా దెబ్బతిన్నదో గుర్తించుకోవాలని బైడెన్ సూచించారు. అయితే చైనా మాత్రం తైవాన్‌ ఆక్రమణకు సన్నద్ధమవుతోంది. ఆ మేరకు వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఏ క్షణంలోనైనా తైవాన్‌పై బీజింగ్‌ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు కూడా గుర్తించాయి. మరోవైపు తైవాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని ఉద్రిక్తతలపై జపాన్‌ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తైవాన్‌ మరో ఉక్రెయిన్‌గా మారుతుందని జపాన్ ప్రధాని కిషిదా హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అప్రమత్తమవ్వాలని కోరుతున్నారు.

మొత్తంగా తైవాన్‌ విషయంలో చైనా ఉక్కు పిడికిలి బిగుస్తోంది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించొద్దంటూ ఒత్తిడి తెస్తోంది. భారత్, అమెరికా, వాటికన్‌ సిటీ సహా 13కు పైగా దేశాలు తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాయి. బీజింగ్‌కు అనుకూల దేశాలు మాత్రం తైవాన్‌ను చైనా అంతర్భంగా గుర్తిస్తున్నాయి. 

Tags:    

Similar News