కరోనాపై చైనా గెలిచింది మూడున్నర నెలలు కరోనాతో అల్లాడిన చైనాకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇవాళ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. మూడున్నర నెలల క్రితం వూహాన్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. రోజుల వ్యవధిల్లోనే పదుల సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. నెలలో వందల పాజిటివ్ కేసులు నమాదయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. వూహాన్ లో దాదాపు కోటి మందిని జనవరి 23 నుంచి ఇళ్లకు మాత్రమే పరిమితం చేసింది. దాదాపు మూడున్నర నెలలపాటు మరణాల పరంపర కొనసాగింది. వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 3,245కు చేరింది. ఈ వారంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నేడు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చైనా అధికారిక ప్రకటన చేసింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని తెలిపింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని, పాజిటివ్ వచ్చిన వారు కూడా చికిత్స తరువాత ఇళ్లకు వెళుతున్నారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.
మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, ప్రస్తుతం 7,263 మందికి చికిత్స కొనసాగుతోంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు.10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించారు. ఆ తర్వాత హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు మొదలైంది. సరిహద్దులను తిరిగి తెరిచి రాకపోకలకు అనుమతించారు. ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు, పనులకు వెళ్లేందుకు, ప్రజలు బయట తిరిగేందుకూ వీలు కల్పించారు. ఇదే సమయంలో చైనాను మరో భయం వెంటాడుతోంది. రెండో సారి కరోనా వ్యాపించే అవకాశాలు కూడా ఉండటమే దీనికి కారణం. చైనాకు సరాసరిన రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇదే చైనాకు ఆందోళన కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని వామానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశించింది. దీని కోసం కొన్ని హోటల్స్ ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది.