Israel : ఔను, పేజర్ల దాడి నేనే చేయించా.. అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని

Update: 2024-11-11 10:17 GMT

Israel PM Benjamin Netanyahu admits Pagers Explosion Attacks: తమ శత్రువులను ఏరిపారేయడానికి ఎన్నో సంచలన దాడులు చేసిన చరిత్ర ఇజ్రాయెల్ సొంతం. కానీ ఇజ్రాయెల్ ఏనాడూ ఆ దాడులకు బాధ్యత వహించిన దాఖలాలు లేవు. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ తొలిసారిగా ఇజ్రాయెల్ ఒక దాడికి తామే బాధ్యులం అని అంగీకరించింది. లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్స్‌ని అణిచేయడమే లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుడు దాడికి తామే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఆదివారం ఆ దేశ అధికార ప్రతినిధి ఒమర్ దోస్త్రీ తెలిపారు. ఫ్రాన్స్‌‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఒమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచాన్ని షేక్ చేసిన పేజర్ పేలుళ్లు

సెప్టెంబర్ 17, 18 తేదీలలో లెబనాన్‌లో సూపర్ మార్కెట్లు, వీధులు, స్మశాన వాటికల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు జరిగాయి. లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన పేజర్ల పేలుళ్ల దాడుల్లో 40 మంది వరకు చనిపోయారు. మరో 3000 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది. శత్రువుల చేతికి పేజర్లు వెళ్లేలా చేసి, ఆ పేజర్లలోకి పేలుడు పదార్థాలు అమర్చి మరి పేల్చారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఎంతో కీలక పాత్ర పోషించింది. దీంతో మొసాద్ పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి ఈ ఘటన ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసింది.

లెబనాన్‌ గడ్డపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కజ్ కూడా ఆదివారం మీడియాతో మాట్లాడారు. హెజ్బొల్లాను ఇజ్రాయెల్ ఓడించిందని కజ్ తెలిపారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టడం అనేది అన్నింటికిమించి పెద్ద విజయంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో శనివారం 50 మంది చనిపోగా ఆదివారం మరో 9 మంది మృతి చెందారు. లెబనాన్ ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది.

ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి - ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం 

ఇదిలావుంటే, మరోవైపు ఫ్రాన్స్ స్టేడియంలో గురువారం ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సాకర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రోన్ స్టేడియంకు రానున్నారు. గత వారం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సాకర్ ఫ్యాన్స్‌పై దాడి జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్.. గురువారం నాటి ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మ్యాచ్‌ను బహిష్కరించాల్సిందిగా తమ దేశానికి చెందిన సాకర్ ప్రియులకు సూచించింది. భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టంచేసింది.

ఇజ్రాయెల్ సాకర్ ఫ్యాన్స్‌పై దాడిని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రోన్ కూడా ఖండించారు. ఇజ్రాయెల్ సాకర్ ప్రియులకు మద్దతుగా ఇజ్రాయెల్ vs ఫ్రాన్స్ సాకర్ మ్యాచ్ వీక్షించేందుకు రానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మ్యాచ్ చూసేందుకు వస్తున్న అభిమానులకు భారీ భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం చుట్టూ వేల సంఖ్యలో పోలీసు బలగాలను మొహరిస్తున్నట్లు ఇమాన్యుయెల్ స్పష్టంచేశారు. 

Tags:    

Similar News