Tulsi Gabbard: అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్.. ఎవరీ తులసి?

Update: 2024-11-14 16:31 GMT

Who is Tulsi Gabbard: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన టీంను నియమించుకుంటున్నారు. తన మద్దతుదారులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులను ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారు. ఈ క్రమంలోనే తులసి గబ్బార్డ్‌కు ట్రంప్ కీలక పదవి అప్పగించారు. చివరి క్షణంలో పార్టీలో చేరిన తులసికి ఏకంగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో ఆమె అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా ఏజెన్సీలకు హెడ్‌గా మారారు.

సైన్యంలో విధులు నిర్వహించిన తులసి 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పోటీపడ్డారు. కానీ ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. దాంతో 2022లో డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టారు. రెండేళ్ల పాటు ఆ పార్టీ విధానాలు నచ్చక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీని వీడి ఈ ఏడాది ఆరంభంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ట్రంప్‌నకు మద్దతు పలికి ప్రచారం చేశారు.


అయితే తులసి గబ్బార్డ్ పేరు విని అంతా ఆమె భారతీయురాలని పొరబడుతుంటారు. తులసి అమెరికాలోని లియోనోలాలో ఏప్రిల్ 12, 1981లో జన్మించారు. ఆమె తల్లి కారోల్ ఇండియానాకు చెందినవారు. తులసికి రెండేళ్లున్నప్పుడే వీరి కుటుంబం హవాయీ దీవుల్లో స్థిరపడింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన తులసి అబ్రహం విలియమ్స్ అనే సినిమాటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకున్నారు.

తన తల్లికి హిందూత్వంపై ఉన్న మమకారంతో తన పిల్లలందరికీ హిందూ పేర్లనే పెట్టారు. చిన్నతనం నుంచే హిందూ ఆచారాలను పాటిస్తూ పెరిగిన తులసి కూడా వైష్ణవ భక్తురాలిగా మారారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేస్తుంటారు. గతంలో పదవీ స్వీకారం సమయంలోనూ ఆమె భగవద్గీతపై ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది. తనను చూసిన వారంతా భారతీయురాలని పొరబడుతుండడంతో ఈ విషయంపై తులసి క్లారిటీ ఇచ్చారు. తాను భారత పౌరురాలిని కాదంటూ 2012లోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News