రన్‌వేపై రెండు ముక్కలైన కార్గో విమానం.. గాల్లోకి ఎగిరిన 25 నిమిషాలకే...
Cargo Airplane Crash: కోస్టారికా దేశ రాజధాని శాన్‌జోస్ విమానాశ్రయంలో ఘటన...
Cargo Airplane Crash: గాల్లోకి ఎగిరిన 25 నిమిషాలకే కార్గో విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. అత్యవసరంగా లాండింగ్ అయ్యింది. అయితే చివరి నిమిషంలో రన్‌వేపై నుంచి జారిపోయిన ఆ కార్గో విమానం రెండు ముక్కలయింది. విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో భయటపడ్డారు. ఈ సంఘటన కోస్టారికా దేశ రాజధాని శాన్‌జోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు.
జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్‌ఎల్‌కు చెందిన బోయింగ్-757 విమానం.. శాన్‌జోస్‌కు సమీపంలోని జువాన్ శాంటా మారియా అంతర్జాతీయ వినాశ్రయం నుంచి ఉదయం 10 గంటల 05 నిమిషాలకు బయలుదేరింది. అయితే హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు పైలెట్ గుర్తించాడు. వెంటనే అత్యవసర లాండింగ్‌కు శాన్‌జోస్ విమానాశ్రయం అనుమతి పొందాడు. 10.30 గంటలకు విమానం రన్‌వేపైకి వచ్చింది. విమానం ఆగే చివరి నిమిషంలో వెనుక చక్రాలు వేగంగా తిరిగాయి. దీంతో కార్గో విమానం అదుపుతప్పి.. రన్‌వేపై నుంచి జారిపోయింది. అతి పెద్ద బోయింగ్ విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. విమానం నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.
అప్రమత్తమైన శాన్‌జోస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది.. అప్పటికే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో విమానంలోని సిబ్బంది స్పృహలోనే ఉన్నారు. ఓ పైలెట్ మాత్రం షాక్‌కు గురయ్యాడు. వెంటనే విమానంలోని సిబ్బదిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్టు కోస్టా రికా ఫైర్‌ఫైటర్స్ ప్రధాన అధికారి హెక్టర్ చావ్స్ తెలిపారు. ఈ ప్రమాదంలో కార్గో విమానంలోని మొత్తం సరుకు బయటపడినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే శాన్‌జోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. సాయంత్రం 6 గంటల మళ్లీ విమానాశ్రయాన్ని తెరిచారు.