Astronauts Sunita Williams: సునితా విలియమ్స్ భూమ్మీదకు తిరిగొస్తున్నట్లున్న వీడియో వైరల్

Update: 2024-10-17 12:56 GMT

Astronauts Sunita Williams returning to earth: సునితా విలియమ్స్‌కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్ నాసా పరిశోధనల్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌కి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తాజాగా భూమ్మీదకు తిరిగివస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 127 రోజులుగా అక్కడే చిక్కుకున్న సునితా విలియమ్స్ తాజాగా భూమ్మీదకు వస్తున్న దృశ్యాలు అంటూ ఆ వీడియోలో పేర్కొంటున్నారు. కానీ అది నిజమా కాదా అనే విషయంతో సంబంధం లేకుండా నెటిజెన్స్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో కింద వారి కామెంట్స్ రాస్తున్నారు.

తాజాగా ఈ వీడియోపై నాసా స్పందించింది. సునితా విలియమ్స్ భూమ్మీదకు ఇప్పుడే తిరిగొస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో లేదని నాసా స్పష్టంచేసింది. ఆమె 2025 లోనే భూమి మీదకు వస్తారని.. అప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే పరిశోధనల్లో బిజీగా ఉంటారని నాసా తేల్చిచెప్పింది.

మరి వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిది?

సునితా విలియమ్స్ భూమ్మీదకు వస్తోన్న వీడియోలో నిజం లేనట్లయితే.. మరి ఆ వీడియో ఎక్కడిది అనే ప్రశ్న కూడా తలెత్తోంది. ఆ ప్రశ్నకు కూడా నాసా జవాబిచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం కూడా సునితా విలియమ్స్ ఇలాగే అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లాచ్చారు. అప్పట్లో కూడా జనం ఆమెకు జేజేలు పలికారు. అప్పట్లో నాసా 7 నిమిషాల నిడివితో ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలోంచే కొన్ని ముక్కలు కత్తిరించి, దానినే కొత్త వీడియోగా మలిచి సునితా విలియమ్స్ తాజాగా భూమ్మీదకు వస్తున్న వీడియో అని ప్రచారం చేస్తున్నారని నాసా వివరించింది.

ఒక వారం రోజుల పరిశోధనల కోసం మరో వ్యోమగామి బారీ విల్మోర్‌తో కలిసి జూన్ 5న సునితా విలియమ్స్ ఐఎస్ఎస్‌కి వెళ్లారు. అయితే, వాళ్లు వెళ్లిన స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో హీలియం లీకేజీ వంటి పలు ఇతర సాంకేతిక లోపాలు తలెత్తాయి. అందువల్లే వాళ్లు వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఖాళీగానే కిందకు తిరిగొచ్చింది. వాళ్లిద్దరు మాత్రం అక్కడే మిగతా వ్యోమగాములతో కలిసి అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొంటున్నారు. వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు నాసా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలైంది. 

Tags:    

Similar News