అమెరికాలో మరో నల్లజాతీయుడి హత్య.. పెరిగిన నిరసన జ్వాలలు
నల్లజాతీయుడి హత్యతో రగిలిపోతున్న అమెరికాలో మరో నల్లజాతీయుడిని హత్య చేయడంతో మరింత రాజుకుంది.
నల్లజాతీయుడి హత్యతో రగిలిపోతున్న అమెరికాలో మరో నల్లజాతీయుడిని హత్య చేయడంతో మరింత రాజుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గాయాలు పాలైన నల్లజాతీయుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన చనిపోవడంతో విషయం తెలుసుకున్న నిరసన కారులు పలుచోట్ల ధ్వంసాలకు పాల్పడ్డారు.
నల్లజాతీయులపై వివక్ష విషయంలో నిరసనజ్వాలలతో రగిలిపోతున్న అమెరికాలో తాజాగా మరో నల్లజాతీయుడు హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్ వద్ద కారులో ఉన్న రేషార్డ్ బ్రూక్స్(27) అనే వ్యక్తిని ఆపిన పోలీసులు, అతడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో, అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా బ్రూక్స్ ప్రతిఘటించాడు.
పోలీసుల వద్ద ఉన్న టేజర్ గన్(విద్యుత్ షాక్‌తో తాత్కాలికంగా మనిషిని కదలకుండా చేసే, హాని కలిగించని ఒక పరికరం) తీసుకుని పరిగెత్తాడు. దీంతో.. అధికారుల్లో ఒకరు బ్రూక్స్‌పై మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బ్రూక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి సర్జరీ నిర్వహించినా అతడి ప్రాణాలు దక్కలేదు. కాసేపటికే ఈ వార్త దావానలంలా పాకడంతో.. అట్లాంటా అట్టుడికిపోయింది. ఘటన జరిగిన చోట ఉన్న వెండీస్ రెస్టారెంట్‌ను నిరసనకారులు పూర్తిగా తగులబెట్టారు. ప్రధాన రహదారులన్నింటినీ నిర్బంధించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ, నగర పోలీసు శాఖ చీఫ్ ఎరికా షీల్డ్స్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. కాల్పులు జరిపిన పోలీసు అధికారిని తొలగిస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది.
మరోవైపు.. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. నగరంలో వారు అక్రమించుకున్న కొంత ప్రాంతానికి 'క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్(చాజ్)' అని పేరు పెట్టి స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. నగరంలోకి రాకపోకలు లేకుండా రహదారుల్ని నిర్బంధించారు. సియాటెల్ పోలీసు శాఖను పూర్తిగా రద్దు చేయాలని, సాయుధ దళాల్ని నిషేధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. మెక్రోసాఫ్ట్, బోయింగ్, వాల్‌మార్ట్, అమెజాన్ వంటి ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలన్నీ సియాటెల్‌లోనే ఉండటంతో.. ఈ ఘటన అమెరికాకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
నగరాన్ని అదుపులోకి తీసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నా.. ఆందోళనలకు సానుభూతి తెలుపుతున్న మేయర్, గవర్నర్‌లు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ తదుపరి చర్య ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. బానిసత్వాన్ని ప్రోత్సహించిన వ్యక్తికి విగ్రహాన్ని న్యూ ఓర్లాన్స్‌లోని నిరసనకారులు ధ్వంసం చేశారు. నగరంలోని డంకన్ ప్లాజా వద్ద ఉన్న జాన్ మెక్‌డొనో విగ్రహాన్ని వీధుల్లోకి లాగి, ట్రక్కులోకి ఎక్కించి.. సమీపంలోని మిస్సిసిపీ నదిలో వదిలేశారు. అందుకు బాధ్యులైన నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.