లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. అసలే మందు కనిపిస్తే ఆగని జనాలకు తాగితే కరోనా రాదనే ప్రచారం తోడవటంతో విచ్చలవిడిగా తాగేస్తున్నారు. కొందరు ఒత్తిళ్లకు లోనై మద్యం సేవిస్తుంటే మరికొందరు కాలక్షేపానికి కూడా తాగేస్తున్నారు. అయితే కరోనా టైమ్‌లో ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు.
మద్యం తాగితే కరోనా సోకదనే ప్రచారాలను కొట్టిపడేశారు ఇటలీ పరిశోధకులు. కొవిడ్ సోకే ముప్పును మరింత పెంచుతుందని తెలిపారు. లాక్‌డౌన్‌లో మద్యం తాగేందుకు జనం ఆసక్తి చూపుతుండగా తాజాగా పరిశోధకులు వెల్లడించిన నివేదికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రోజూ మద్యం తాగినా ఓ మోస్తరుగా తీసుకున్నా కొవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువే అంటున్నారు నిపుణులు.
లాక్‌డౌన్ సమయంలో అమెరికా, బ్రిటన్ సహా అన్ని దేశాల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఇండియా, సౌతాఫ్రికా, శ్రీలంకలో మద్యం షాపులు మూసినా వినియోగం తగ్గలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మద్యం షాపులకు అనుమతి వచ్చిన నాటి నుంచి మన దేశంలో మద్యం ప్రియులు అతిగా తాగేస్తున్నారు.
సాధారణంగా ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్లతో మద్యాన్ని ఆశ్రయించే వారు అధికం. ఇక కరోనా సంక్షోభంలో తలెత్తిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా చాలా మంది మద్యం సేవిస్తున్నారు. అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో కాలక్షేపానికి తాగేవారు కూడా ఉన్నారు. అయితే సాధారణంగానే మనిషి శరీరంలో విపరీత ప్రభావం చూపే ఆల్కహాల్‌ను కరోనా టైమ్‌లో తీసుకోవటం ప్రమాదం అని హెచ్చిరిస్తున్నారు పరిశోధకులు.
కరోనా వ్యాధి ప్రభావాన్ని తీవ్రతరం చేసేందుకు మద్యం తోడ్పడుతుందని ఇటలీ పరిశోధకులు వెల్లడించారు. శ్వాసకోస వ్యవస్థలో వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నారు. మద్యం వ్యసనంగా ఉన్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా ఉండటంతో వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు మానవ కణాల్లోకి కరోనా ప్రవేశించేందుకు ఉపయోగపడే ఏసీఈ-2 ప్రొటీన్ స్థాయిలను కూడా మద్యం పెంచుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవలే మద్యం వినియోగంపై హెచ్చరికలు జారీ చేసింది. మద్యం తాగితే కరోనా రాదనే అపోహలపై క్లారిటీ ఇచ్చింది. మద్యంతో స్వల్ప, దీర్ఘకాలిక సమస్యలున్నాయని శరీరంలోని ప్రతీ భాగంపై మద్యం ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఆల్కహాల్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని శ్వాసకోస ఇబ్బందులను పెంచుతుందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.