Afghanistan: తీవ్ర సంక్షోభంలో ఆఫ్ఘనిస్తాన్
*చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు నివేదికలు *ఆఫ్ఘనిస్తాన్‌లో యూనిసెఫ్ సభ్యుల పర్యటన
Afghanistan: తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నెలకొన్న పరిస్థితులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పోషకాహర లోపంతో 10లక్షల మంది చిన్నారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్ వెల్లడించింది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టకుంటే చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గాన్‌లో చిన్నారుల పరిస్థితులను పర్యవేక్షించేందుకు యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అబ్దీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇందులో భాగంగా కాబుల్‌లోని ఇందిరా గాంధీ చిన్నారుల ఆస్పత్రిలో పిల్లలను పరిశీలించిన ఆయన. ఎంతో మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మిజిల్స్, తీవ్రమైన నీటి విరేచనాలు చిన్నారుల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం తాలిబన్ నేతలతో భేటీ అయిన ఒమర్ అబ్దీ. చిన్నారులకు ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఇమ్యూనైజేషన్, పోషకాహారం, మంచినీరు, పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. లేకుంటే చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కొవిడ్-19, పోలియో, మిజిల్స్ టీకాల పంపిణీని వెంటనే పునఃప్రారంభించాలని ఒమర్ అబ్దీ తాలిబన్ నాయకులకు సూచించారు. యునిసెఫ్ గణాంకాల ప్రకారం, ప్రపంచంలో కేవలం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో మాత్రమే పోలియో ఎక్కువగా ఉంది.
ఇదిలాఉంటే, ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఈమధ్యే ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.