Shinzo Abe Death: షింజో హత్యతో నివ్వెరపోయిన ప్రపంచం
Shinzo Abe Death: ప్రపంచ వ్యాప్తంగా హత్యకు గురైన నేతలపై చర్చ
Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబె హత్య... ప్రపంచాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది. ఆ దేశ పార్లమెంట్ ఎగువసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరా నగరంలో ప్రసంగిస్తుండగా షింజో అబెపై ఓ దుండగుడు తుపాకీ కాల్పులకు తెగబడ్డాడు. తీవ్ర రక్తస్రావం పాలైన అబె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జపాన్ రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం.. ఆర్థిక విధానాల్లో తనదైన ముద్ర వేసి.. ప్రపంచ నేతగా షింజో గుర్తింపు పొందారు. షింజో హత్యతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హత్యకు గురైన నేతలపై అందరూ దృష్టి సారించారు. దారుణ హత్యలకు గురైన దేశ నేతల్లో భారత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతో సహా అమెరికాకు చెందిన ఇద్దరు అధ్యక్షులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
జపాన్‌లో ప్రస్తుతం పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నికలు జరగనున్నాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మాజీ ప్రధాని షింజో అబె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పశ్చిమ జపాన్‌లోని నరా నగరంలోని ఓ కూడలిలో ప్రసంగిస్తున్న షింజోపై ఓ దుండగుడు రెండు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో మాజీ ప్రధాని అక్కడికక్కడే కుప్పకూలాడు. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. నాలుగు గంటల పాటు వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. మృత్యువుతో పోరాడి.. షింజో కన్నుమూశారు. షింజో హత్య.. ప్రపంచాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది. భారత్‌తో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్న షింజో మరణం తనను షాక్ గురి చేసిందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. ఆయనపై గౌరవానికి గుర్తుగా జూలై 9న జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్టు ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో మృతితో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హత్యకు గురైన నేతలపై అందరూ దృష్టి సారించారు. 1984 అక్టోబరు 31న ఢిల్లీలోని సప్దర్‌జంగ్ రోడ్ నంబరు వన్‌లోని అధికారిక నివాసంలో అప్పటి ప్రధాని, ఐరన్ లేడీగా పేరున్న ఇందిరా గాంధీపై ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపారు. ఆమెను హుటాహుటిన ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అయినప్పటికీ తొలి మహిళా ప్రధానిని వైద్యులు కాపాడలేకపోయారు. ఆ దురదృష్టకరమైన రోజున దేశమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందిరా హత్యకు గురైన ఆ భవనాన్ని స్మారక చిహ్నంగా ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టి.. 1989 వరకు పని చేసిన ఆమె కుమారుడు, రాజీవ్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలోనే హత్యకు గురయ్యాడు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీకి వెళ్లిన ఆయన... మహిళ ఆత్మహుతికి బాంబరుతో హత్యకు గురయ్యాడు. ఇలా భారత్‌కు చెందిన ఇద్దరు ప్రధానమంత్రులు.. దారుణ హత్యలకు ప్రాణాలను కోల్పోయారు. వీరిద్దరే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, అమెరికా నాయకులు కూడా హత్యలకు గురయ్యారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఇద్దరు అధ్యక్షులు బలయ్యారు. అమెరికాలో సివిల్ వార్‌కు నాయత్వం వహించిన ఆ దేశ 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కూడా హత్యకు గురయ్యారు. 1865 ఏప్రిల్ 14న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటరులో రంగస్థల నటుడు జాన్ విల్కేస్ అనే వ్యక్తి లింకన్‌ను కాల్చి చంపాడు. ఆ థియేటర్‌ను వారసత్వ సంపదగా.. అమెరికా ప్రభుత్వం భద్రపరిచింది. ఆయన తరువాత ముద్దుగా జేకేఎఫ్‌గా పిలుచుకునే... అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కూడా హత్యకు గురయ్యాడు. 1963 నవంబరు 22న డల్లాస్‌లో కెన్నడీని మాజీ అమెరికా మెరైన్ అధికారి తుపాకీతో కాల్పులు జరిపి.. హతమార్చాడు. ఇరువురి అధ్యక్షుల ప్రాణాలను బలిగొన్న గన్ సంస్కృతి.. శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయి ఇప్పటికీ మారణహోమం సృష్టిస్తూనే ఉంది. ఆ దేశంలో గన్ కంట్రోల్ చట్టాన్ని ఇప్పటికీ కఠినతరం చేయలేదు. ఫలితంగా నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆరు నెలల్లో 22వేల మంది తుపాకీ తూటాలకు బలయ్యారంటే.. అక్కడి పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించిన నేతలు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి.. ఆ దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా హత్యకు గురయ్యారు. 1971 ఏప్రిల్ నుంచి బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడిగా.. ఆ తరువాత ప్రధానిగా అయిన రెహమాన్, కుటుంబ సభ్యులతో సహా 1981మేలో చిట్టాగాంగ్‌లో దుండగులు కాల్చి చంపారు. అవిభక్త భారత్‌లోని కర్నాల్‌లో జన్మించిన లియాఖత్ అలీఖాన్.. 1947 నుంచి 1951వరకు తొలి పాకిస్థాన్ ప్రధానిగా పని చేశారు. 1951 అక్టోబరు 16న రావల్పిండిలోని కంపెనీ బాగ్ సభలో ప్రసంగిస్తుండగా.. ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. లియాఖత్ హత్యే కాకుండా.. రావల్పిండిలో మరో మాజీ ప్రధాని కూడా బలయ్యారు. 2007 డిసెంబరు 27న ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కొద్దిసేపటికే ఆత్మహుతి దాడిలో మరణించారు. 1989 నుంచి 1993 మధ్య కాలంలో శ్రీలంకగా అధ్యక్షుడిగా ఉన్న రణసింగ్ ప్రేమదాస 1993లో హత్యకు గురయ్యారు.
నేపాల్‌లో రాజ కుటుంబీకుల హత్య.. ఆ దేశాన్ని కుదిపేసింది. రాజు బీరేంద్ర బీర్ బిక్రమ్ షా దేవ్, కొందరు రాజ కుటుంబ సభ్యులను 2001లో ఆయన కుమారుడే హత్య చేశాడు. రాజు బీరేంద్ర 1972 జనవరి 31న సింహాసనాన్ని అధిష్ఠించి.. మూడు దశాబ్దాల పాటు నేపాల్‌ను పాలించారు. మొదటి సంపూర్ణ చక్రవర్తిగా, 1990 నుంచి రాజ్యాంగ చక్రవర్తిగా ఆయన పరిపాలన అందించారు. 2003 మార్చి 12లో సెర్బియా ప్రధానమంత్రి జోరన్ జింద్‌జిక్ కూడా హత్యకు గురయ్యాడు. ఇలా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుంచి నేటి షింజోవరకు పలువురు హత్యలతో ప్రాణాలు వదిలారు.