Sand Storm: అమెరికాలో బీభత్సం సృష్టించిన ఇసుక తుఫాన్
Sand Storm: ఇసుక తుఫాన్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం * ఒకదానికి ఒకటి ఢీకొన్న 20కి పైగా వాహనాలు
Sand Storm: భారీ శబ్ధాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితి.. చూద్దామన్నా కళ్లు తెరవలేకపోయారు.. ప్రమాదం జరుగుతుందని, ఆ ప్రమాదంలోనే తాము కూడాచిక్కుకున్నామని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. క్షణాల్లో చుట్టుముట్టిన ఇసుక తుఫాన్ దెబ్బకు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. అమెరికాలోని ఉతా హైవేపై గంటకు 51 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఇసుక తుఫాన్ కారణంగా పెద్ద ఎత్తున వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో మొత్తం 20కి పైగా వెహికల్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన కాసేపటికి ఇసుక తుఫాన్ శాంతించినా రోడ్డుకు ఇరువైపులా ధ్వంసమైన వాహనాలతో ఆ ప్రాంతం భీకరంగా మారిపోయింది. కనోష్-సాల్ట్‌లేక్ సిటీకి దక్షిణాన 258కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్ అనంతరం అక్కడి పరిస్థితులను చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి అమెరికాలో ఇసుక తుఫాన్‌లు, టోర్నడోలు సర్వసాధారణం. అయితే, ఈ ప్రమాదం మాత్రం తాము తప్పించుకోడానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు గాయపడిన వారు.