Israel: గాజా గజగజ.. ఇజ్రాయెల్ దాడిలో 2,750 మంది మృతి
Israel: 9,700 మందికి పైగా గాయాలు.. శిథిలాల కింద వెయ్యి మంది ఉన్నట్లు గుర్తింపు
Israel: ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. తమపై దాడి చేసిన గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం ప్రకటించింది. దీంతో గాజా నగరం కుప్పకూలుతోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 2,750 మంది ప్రాణాలు కోల్పోయారని, 9,700 మంది గాయాలపాలయ్యారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ దాడుల నేపథ్యంలో కొంతమందిని కాపాడినట్లు పాలస్తీనా పౌర రక్షణ బృందం తెలిపింది. శిథిలాల కింద వెయ్యి మందికి వరకు ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇబ్బందికరంగా మారిందని, అలాగే ఉంచితే కుళ్లిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
మొదట్లో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడి చేస్తోంది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడి ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ టెర్రరిస్టులు చెప్పినట్లుగా ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే హమాస్ మిలిటెంట్లు దీనిని ధ్రువీకరించలేదు.
ఆందోళనకర పరిణామాల నడుమ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. గాజాకు మానవతా సాయం అందించేందుకు అనుమతిస్తామని ప్రకటించారు. హమాస్ మిలిటెంట్లు అపహరించిన తమదేశ పౌరులను తిరిగి తీసుకొచ్చే విషయానికి కట్టుబడి ఉన్నామన్నారు.ఇది తమందరి యుద్ధంగా పేర్కొన్న నెతన్యాహు.. ఐసిస్ వంటి హమాస్ ఉగ్రసంస్థను అణచివేసేందుకు ప్రపంచమంతా ఒక్కటవ్వాలని విజ్ఞప్తి చేశారు.
లేనిపక్షంలో ముప్పు కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ ఇరాన్‌తోపాటు ఆ దేశ మద్దతుగా నిలిచిన హిజ్బుల్లాను హెచ్చరించారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ అమర్చిన సెక్యూరిటీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించిన వేళ ఈ హెచ్చరిక చేశారు. హిజ్బుల్లా బలగాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పలుమార్లు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ సైతం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేపడుతోంది.