రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న అతిపెద్ద సంక్షోభం కరోనా. కంటికి కనిపించని ఈ వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ కు భయపడి నిర్బంధంలో తలదాచుకుంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచానికి పాకిన ఈ కరోనా వైరస్ కు నిన్నటితో వంద రోజులు.
లక్షల మందిని పట్టిపీడిస్తోన్న ఈ కరోనా వైరస్ జన్మ స్థానం చైనాలోని వుహాన్ నగరం. హువే ప్రావిన్స్ లోని ఈ నగరంలోని ఓ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. మొదటగా ఈ వైరస్ 57 సంవత్సరాల మహిళకు సోకిందని అధికారులు గుర్తించారు. 2019 డిసెంబర్ 10న జలుబు, జ్వరంతో బాధపడిన ఆ మహిళ ఇంజెక్షన్ చేయించుకున్నా తగ్గకపోవడంతో డిసెంబర్ 16న వూహాన్ యూనియన్ హాస్పిటల్ కు వెళ్ళగా పరిశీలించి హాస్పిటల్ కు తరలించారు.
కరోనాను వూహాన్ లో డిసెంబర్ నెల చివరలో గుర్తించామని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. అప్పట్లో దీనిని 'న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్' గా భావించినట్టు తెలిపింది. కరోనా వైరస్ ను గుర్తించిన తర్వాత 2019 డిసెంబర్ 30న వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తన పరిధిలోని అన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్లకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. న్యూమోనియా ఆఫ్ అన్ నౌన్ కాజ్ తో అడ్మిట్ అయిన పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అందులో సూచించింది. ఆ తర్వాత డిసెంబర్ 31 న కరోనా వైరస్ 27 మందికి వచ్చిందని ప్రకటిస్తూ జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక జనవరి 3న కరోనా వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సమాచారం ఇచ్చింది చైనా. జనవరి 11న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. నెల రోజుల వ్యవధిలోనే చైనాలో 6 వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. దాంతో జనవరి 23న లాక్ డౌన్ ను ప్రకటించింది అయితే అప్పటికే చైనీస్ న్యూ ఇయర్ హాలీడేస్ కోసం అప్పటికే 50 లక్షల మందికిపైగా జనం సిటీని వదిలి వెళ్లిపోయారు. దాంతో వైరస్ మరింత విస్తరించింది.
జనవరి చివరినాటికి కరోనా ఇతర దేశాలకు కూడా విస్తరించటంతో అప్రమత్తమైంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చైనాలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయంటూ జనవరి 30న గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.