Salman Khan: రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే..లేదంటే సిద్దిఖీ కంటే దారుణంగా హతమార్చుతాం..సల్మాన్ కు బెదిరింపులు
Threats to Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ దారుణంగా చంపేస్తామంటూ ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు.అగంతకులు రూ. 5కోట్లు డిమాండ్ చేశారు.
Threats to Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5కోట్లు ఇవ్వాల్సిందేనంటూ అగంతకులు బెదిరింపులకు దిగారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు గురువారం రాత్రి బెదిరింపు మెసేజ్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఈ బెదిరింపులను తేలికగా తీసుకోకూడదని..సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ. 5కోట్లు చెల్లించాలని..ఈ డబ్బులు ఇవ్వనట్లయితే మాజీ ఎమ్మెల్సీ సిద్దిఖీ కంటే దారుణంగా హతమార్చుతామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా కోణంలో విచారణ చేపడతామని ముంబై పోలీసులు వెల్లడించారు.
కాగా నిన్న నవీ ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్‌ను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో పట్టుబడిన నిందితుడిని సుఖా అలియాస్ సుఖ్‌బీర్ బల్బీర్ సింగ్‌గా గుర్తించారు. నటుడిపై దాడి చేసేందుకు సుఖా ఇతర ముఠా సభ్యులకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సుఖ తన హ్యాండ్లర్ డోగర్‌తో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నాడు. ఈ కుట్రను అమలు చేసేందుకు పాకిస్థాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఏకే-47, ఎం16, ఏకే-92లను ఉపయోగించాలని ముఠా భావిస్తున్నట్లు సమాచారం.