US: అమెరికాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు తన సొంత తుపాకీ పేలి హైదరాబాదీ విద్యార్థి ఒకరు దుర్మరణం పాలయ్యారు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాల్వాయి ఆర్యన్ రెడ్డి ఈనెల 13న మరణించారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఉప్పల్లోని ధర్మపురికాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈనెల 13న స్నేహితులతో కలిసి తన బర్త్ డే జరుపుకున్నాడు.
అదే రోజు ఆర్యన్ తన గది నుంచి తుపాకీ శబ్దం వచ్చింది. స్నేహితులు వెళ్లి చూసేసరికి అతను మరణించాడు. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో ఆర్యన్ అక్కడికక్కడే మరణించాడు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో మిస్ ఫైర్ అయి ఆర్యన్ మరణించి ఉంటాడని ఆయన తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
దేశసేవ అంటే ఆర్యన్ కు చాలా ఆసక్తి ఉండేదని తండ్రి తెలిపారు. ఆర్మీలో చేరతానంటే తామే వద్దమని చెప్పారు. అమెరికాలో ఉన్న గన్ కల్చరే తమ కుమారుడిని పొట్టనపెట్టుకుందని ఆవేదన చెందారు. అక్కడ విద్యార్ధులకు కూడా గన్ లైసెన్సులు ఇస్తారన్న విషయం ఇప్పుడే తెలిసిందని తెలిపారు.
కాగా ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులో హంటింగ్ గన్ కు లైసెన్స్ తీసుకున్నారు. దీనికోసం ఓ పరీక్ష కూడా రాసినట్లు తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు.