Kerala fireworks accident : కేరళలోని ఓ ఆలయంలో పేలిన బాణాసంచా ..150మందికి గాయాలు..8మంది పరిస్థితి విషమం

Kerala fireworks accident : కేరళ కసర్ గోడ్ జిల్లాలోని ఓ ఆలయంలో సోమవారం రాత్రి బాణాసంచా పేలింది. ఈ ప్రమాదంలో 150 మంది గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Update: 2024-10-29 02:19 GMT

Kerala fireworks accident : బాణాసంచా పేలుడు ప్రమాదంలో కేరళలోని కసర్ గోడ్ జిల్లా ఉలిక్కిపడింది. నీలేశ్వరంలోని ఓ దేవాలయంలో బాణాసంచా పేలి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో 150 మంది వరకు గాయపడ్డారు.అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం..కసర్ గోడ్ నీలేశ్వరంలోని అంజుట్టంబలం వీరార్ కావు ఆలయంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. థేయంకట్ట మహోత్సవాన్ని చూసేందుకు ఆలయానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వేడుకలో భాగంగా బాణాసంచా కాల్చారు. అయితే బాణాసంచా వెళ్లి పక్కన ఉన్న ఓ గదిలో పడింది.

ఆ గదిలో అప్పటికే బాణా సంచా ఉండటంతో ఒక్కసారి పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ వాతావరణం భయానకంగా మారింది. అక్కడి ప్రజలు ఏమౌతుందో తెలియక షాక్ కు గురయ్యారు.

పేలుడు అనంతరం ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే 150 మంది గాయపడినట్లు సమాచారం.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నీలేశ్వరం, కనహంగద్ లోని పలు ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కన్నూర్ లోని పరియారం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి నుంచి వారిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.


ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆలయం ఆవరణలో బాణసంచా కాల్చారని పోలీసులు దర్యాప్తులో తేలింది. అంతేకాదు బాణాసంచాకు ఎలాంటి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఆలయ అధ్యక్షుడు, కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. పేలుడు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.


Tags:    

Similar News