UP: తీవ్ర విషాదం..మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం
UP Medical College :యూపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు.
UP Medical College : యూపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆషుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న శిశువులకు ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో పొగ వ్యాపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. కాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు చికిత్స అందిస్తామని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్, ఆరోగ్యశాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరారు.