Cyber Crime: షేర్ మార్కెట్ పేరుతో డాక్టర్ బురడీ..సైబర్ మోసంతో రూ.8కోట్లు మాయం
Cyber Crime: సైబర్ కేటుగాళ్లు అమాయకులే టార్గెట్ గా చేసుకొని రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో బురిడీ కొట్టించి డాక్టర్లను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
Cyber Crime: సైబర్ కేటుగాళ్లు అమాయకులే టార్గెట్ గా చేసుకొని రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో బురిడీ కొట్టించి డాక్టర్లను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఓ డాక్టర్ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్ల ముఠా చేతికి చిక్కి దాదాపు 8 కోట్ల వరకు నష్టపోయిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే KPHB కాలనీలో పనిచేసే ఈ డాక్టర్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకున్నాడు.
ముందుగా వారు డాక్టర్ నుంచి డబ్బులు గుంజేందుకు తమను తాను స్టాక్ ఇన్వెస్టర్ బ్రోకర్లుగా పరిచయం చేసుకున్నారు. మీరు పెట్టిన పెట్టుబడిని పెంచుతామని నమ్మించి డాక్టర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బును గుంజే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా విడతలవారీగా డాక్టర్ వద్ద నుంచి డబ్బులను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 64 వాయిదాలలో డాక్టర్ వద్ద నుంచి సుమారు 8 కోట్ల వరకు లాగేశారు. మొదటి రోజు 25 లక్షలు, రెండో రోజు 63 లక్షలు, ఇలా ప్రతిరోజు లక్షల చొప్పున డబ్బులు షేర్లు ట్రేడింగ్ చేస్తామని చెప్పి వైద్యుడు నుంచి డబ్బులను కాజేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 8 కోట్ల వరకూ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు డాక్టర్ పేర్కొన్నారు.
ఈ మోసానికి సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) దర్యాప్తు ప్రారంభించింది. నిందితులను గుర్తించే పనిలో పడింది. అయితే డాక్టర్ అకౌంటు నుంచి మాయమైన డబ్బు, దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకుల ఖాతాల్లో చేరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా ఈ ఖాతాలను మ్యూల్ ఖాతాలు అని పిలుస్తారు. వీటిని సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తుంటారు. మరోవైపు సెబీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ అవగాహన లేని కారణంగా చాలామంది ఇన్వెస్టర్లు ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో బారిన పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
స్టాక్ మార్కెట్లో ప్రవేశించాలంటే పలు స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు డిమాట్ సేవలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం బ్రోకరేజ్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటి ద్వారా మీరు డిమాట్ అకౌంట్ లో షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. షేర్ మార్కెట్ పై అవగాహన లేకపోయినట్లయితే సెబి గుర్తించిన సర్టిఫైడ్ ఇన్వెస్టర్ల నుంచి సలహాలను పొందవచ్చు. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ రికమండేషన్ పేరిట కొంతమంది కేటుగాళ్లు విసిరే వలలపై పడవద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.