Asifabad: ఆదివాసీ మహిళపై ఆత్యాచారయత్నం..అట్టుడుకుతున్న జైనూరు..కర్ఫ్యూ విధింపు
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం ఘటనతో నిరసనలు చెలరేగాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మరోవైపు స్థానికంగా కర్య్ఫూ విధిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Asifabad: అసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండల పరధిలో ఉద్రిక్తత నెలకొంది. రాఖీ పౌర్ణమి నాడు ఆదివాసీ మహిళపై మగ్దూం అనే యువకుడు అత్యాచారయత్నం చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆదివాసీ, గిరిజన సంఘాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో స్థానికంగా అల్లర్లు చెలరేగాయి.కాగా ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సదరు మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసేందుకు యత్నించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తుంది.
సెప్టెంబర్ 1న బాధితురాలి తమ్ముడు నిందితుడిపై సిర్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై అత్యాచారయత్నం, హత్యతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనను ఖండిస్తూ ఆదివాసీ సంఘాలు బుధవారం బంద్ చేపట్టగా..స్థానికంగా అల్లర్లు చెలరేగాయి. పలు దుకాణాలపై దాడులు చేయడంతోపాటు కార్లను ధ్వంసం చేశారు.
జైనూరులో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. జైనూరులో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంటర్నేట్ సేవలను నిలిపివేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం రాళ్ల దాడి జరగడంతో పలువురికి గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి వెయ్యి మంది పోలీసులు దిగారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పోలీసు పహారాలోనే ఉంది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.