Crime News: అందరూ చూస్తుండగానే కొలీగ్‌ను నరికి చంపేశారు.. కారణం ఏంటంటే..
Pune Female Colleague Murder Case: పూణెలో తనతో పాటే కంపెనీలో పనిచేస్తోన్న శుభద కొరడే అనే తోటి ఉద్యోగినిని కృష్ణ కనెజ అనే యువకుడు నరికి చంపాడు. వారి ఆఫీస్ పార్కింగ్ లాట్ స్థలంలో ఉద్యోగులు అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. అందరూ ఫోన్లతో రికార్డింగ్ చేస్తూ నిలబడ్డారే తప్ప ఆమెపై దాడి చేస్తోన్న యువకుడిని ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఆమె ఈ దాడిలో స్పహకోల్పోయాకే ఆ యువకుడు కత్తిని దూరంగా విసిరేశారు. ఆ తరువాతే తోటి ఉద్యోగులు అందరూ చుట్టుముట్టి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగింది?
కృష్ణ కనేజ (30) WNS Global అనే బీపీఓ కంపెనీలో ఎకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. శుభద కొరడె (28) ఆయనకు అదే కంపెనీలో సహోద్యోగి. కృష్ణ కనెజ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఆయన వద్ద అనేకసార్లు డబ్బులు అప్పుగా తీసుకుంది. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, చికిత్స కోసం డబ్బులు కావాలని చెప్పడంతో అడిగిన ప్రతీసారి డబ్బులు అప్పుగా ఇస్తూ వెళ్లానని చెప్పారు. అయితే, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా... ఆ డబ్బులు ఇవ్వకుండా ఇంకా తన తండ్రి ఆరోగ్యం అలానే ఉందని చెబుతూ వచ్చారన్నారు. ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ యువతి గ్రామానికి వెళ్లి వారి తండ్రి గురించి ఆరా తీశానన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆమె తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమె అబద్దాలు చెప్పి తన వద్ద డబ్బులు తీసుకున్నారని అర్థమైందన్నారు.
ఇదే విషయమై ఆఫీసులో పార్కింగ్ స్థలంలో అడిగి తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా అడిగానన్నారు. ఆమె డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడం వల్లే తాను ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని కృష్ణ కనేజ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సాయంత్రం 6 గంటలకు దాడి జరిగింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి 9 గంటలకు యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. పూణెలో నేరాలు పెరిగిపోతున్నాయని, పదునైన మారణాయుధాలతో గ్యాంగులు తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అజిత్ పవార్ పోలీసులను నిలదీశారు.