Madya pradesh: భారం అనుకుని గొంతు కోశారు.. కానీ మృత్యువునే జయించింది ఆ చిన్నారి..
ఆడపిల్లలు తాము కాలు పెట్టని రంగం లేదన్నట్టుగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. ఆడపిల్ల పుడితే భారమని భావించే కాలం నుంచి ఆడపిల్లే పుట్టాలని కోరుకునే కాలం వరకు వచ్చాం.

భారం అనుకుని గొంతు కోశారు.. కానీ మృత్యువునే జయించింది ఆ చిన్నారి..
Madya pradesh: ఆడపిల్లలు తాము కాలు పెట్టని రంగం లేదన్నట్టుగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. ఆడపిల్ల పుడితే భారమని భావించే కాలం నుంచి ఆడపిల్లే పుట్టాలని కోరుకునే కాలం వరకు వచ్చాం. కానీ కొందరు మాత్రం అక్కడే ఆగిపోయారు. ఆడ పిల్లల్ని ఇంకా భారంగానే భావిస్తున్నారు. ఒకప్పడు కడుపులో ఉండగానే చంపేసేవాళ్లు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పుట్టిన తర్వాత చంపేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డను తన కన్న తల్లే హతమార్చాలనుకుంది. తన తల్లి సాయంతో గొంతు కోసి మరీ చెత్తకుప్పలో పడేసింది. కానీ ఆ పాప ఆయుష్షు గట్టిది కాబోలు.. బ్రతికి బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లో ఓ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల వద్దనుకున్న ఆ మహిళ కర్కశంగా వ్యవహరించింది. తన తల్లి సాయంతో చిన్నారి గొంతు కోసింది. తీవ్ర రక్త స్రావం కావడంతో చనిపోయిందని భావించి వారు ఓ చెత్తకుప్పలో పడేశారు. కాసేపటి తర్వాత చిన్నారి ఏడవడం ప్రారంభించింది. ఆ రోదనలు విన్న స్థానికులు.. అక్కడకు వెళ్లి చూశారు. ఒళ్లంతా రక్తంతో ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని ముందుగా భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు.
నెల రోజుల పాటు ఆ చిన్నారికి చికిత్స చేసి ప్రాణాలు పోశారు డాక్టర్లు. పాప గొంతు కోసినా ధమనులు, సిరలు తెగనందువల్లే చిన్నారి బ్రతకగలిగిందని వైద్యులు తెలిపారు. ఆమెకు ముద్దుగా పిహు అని పేరు పెట్టినట్టు చెప్పారు. మృత్యువును జయించిన ఆ చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ అనుమతితో ఓ సంక్షేమ కేంద్రానికి తరలించినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దారుణానికి పాల్పడిన చిన్నారి తల్లి, అమ్మమ్మను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.