Child Trafficking Case: రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న 'సృష్టి' లీలలు

Update: 2020-08-19 10:53 GMT

Child Trafficking Case: తీగ లాగితే డొంక కదిలినట్లయింది సృష్టి ఆస్పత్రి వ్యవహారం ఒక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అనేక తప్పులు చేసి కటకటల పాలయ్యారు ఆస్పత్రి నిర్వాహ కులు. అయినా సృష్టి లీలలు ఆగడం లేదు. రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఎంతో మంది తల్లులను మోసం చేసారు. ఆ పాపం ఊరికే పోదుకదా ఇప్పుడు నీడలా వెంటాడుతోంది. సృష్టి ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ నమ్రత, డాక్టర్‌ తిరుమల సరోగసి, ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలు లేని దంపతులకు బిడ్డలు అందిస్తామని చెప్పి బేరం కుదుర్చుకునేవారు. అందుకోసం ఆస్పత్రులకు వచ్చే నిరుపేద గర్భిణులను టార్గెట్ చేసేవారు. వారికి డబ్బు ఆశ చూపి ఆస్పత్రిలోనే పురుడు పోసి పిల్లలను కోట్ల రూపాయలకు అమ్ముకునేవారు.

మాడుగుల ప్రాంతానికి చెందిన సుందరి అనే మహిళ సృష్టి ఆస్పత్రి నిర్వాహకులు తనను మోసం చేసి, తన బిడ్డను అమ్మేశారని జూన్‌ నెలలో మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి నిర్వాహకులు అప్పటికే సుందరి బిడ్డను కోల్‌కతాలోని దంపతులకు అమ్ముకున్నారు. సుందరి ఫిర్యాదుతో ఆందోళన చెందిన సృష్టి నిర్వాహకులు, మధురవాడకు చెందిన లావణ్యకు పుట్టిన బిడ్డను సుందరికి అప్పగించి సమస్య నుంచి బయటపడే యత్నం చేశారు. కానీ లావణ్య తన బిడ్డను తిరిగి ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గాజువాకకు చెందిన యువతికి డబ్బు ఆశ చూపి ఆమె బిడ్డను లావణ్యకు అప్పగించారు. కానీ సుందరి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల విక్రయం, అక్రమ రవాణా కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరో 22 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి అసలు తల్లిదండ్రులను గుర్తించేందుకు శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం కోర్టు అనుమతి కోరనున్నామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News