తీరని కోర్కెలుంటే వెంటనే తీర్చేసుకోండి...అవును. భూమి అంతం కాబోతోంది..ఏప్రిల్ 23న ఈ విశ్వం అంతరించబోతోంది..అందుకే తీరని కోర్కెలు తీర్చేసుకోవాలని, కొందరు అంటున్నారు.
గతంలోనూ భూమి అంతానికి సంబంధించి, చాలా వార్తలొచ్చాయి. 2000 సంవత్సరమే ఆఖరని కొందరంటే, 2012 అని మరికొందరు, 2017 డిసెంబర్ అని మరికొందరు జోస్యం చెప్పారు.
2018 సెప్టెంబర్ 23న, భూమి అంతం కాబోతోందన్న వార్త కూడా, కొన్ని నెలల క్రితం చక్కర్లు కొట్టింది. అమెరికాలో హరికేన్, భూకంపాలు దానికి సూచికలన్న థియరీలు కూడా చెలరేగాయి. సెప్టెంబర్ వరకూ కాదు, ఈనెల 23నే భూమి అంతరించిపోవడం ఖాయమని, కాన్‌స్పిరసీ థియరిస్టు డేవిడ్ మీడే, లేటెస్ట్‌గా ప్రకటించాడు. అందుకు సంబంధించి, ఆయన గట్టి ఆధారాలు, వాటిని అల్లుకున్న సిద్దాంతాలనూ ఉదహరిస్తున్నాడు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఏప్రిల్ 23 భూమికి డెడ్‌లైన్....డేవిడ్ ప్రకారం ఇంకా మనకు మిగిలి ఉన్నది 15 లేదంటే 14 రోజులు. అసలు డేవిడ్ మీడే ఎవరు ఏ సిద్దాంతాన్ని అనుసరించి ఈ వాదనలు చేస్తున్నాడు నమ్మి కంగారుపడాలా జరిగేదేదో జరుగుతుందని ఊరుకోవాలా చాలా డెడ్‌లైన్లు విన్నాం అందులో ఇదీ ఒకటని నిశ్చింతగా ఉండాలా? అసలు డేవిడ్ మీడే సిద్దాంతమేంటి?
డేవిడ్ మీడే. గత కొద్ది నెలలుగా భూమి అంతరిస్తుందని తరచూ హెచ్చరికలు చేస్తున్న కాన్‌స్పిరసీ థియరిస్టు. ఈ నెల 23న రాత్రి 12 గంటల ఒక నిమిషానికి భూమికి విపత్తు తప్పదని, ముహూర్తం ఫిక్స్ చేశాడు డేవిడ్ మీడే. భూమి మీద ప్రాణికోటికి ఇదే చివరి దినమని ప్రకటించేశాడు.
ఏప్రిల్ 23నే ఎందుకు?
గతంలోనే డేవిడ్, చాలాసార్లు భూమి అంతం గురించి రకరకాల ప్రకటనలు చేసినా, ఈసారి మాత్రం పాత ఉదాహరణలు అయిన నిబిరు, ప్లానెట్ ఎక్స్‌తో పాటు జోంబీ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని మరీ, ఈ ప్రకటన చేశాడు. తన అంచనా తప్పదంటున్నాడు. మరి ఏప్రిల్ 23నే భూమి అంతం అవుతుందని ఎలా చెబుతున్నాడు?
బైబిల్ ప్రకారం క్రీస్తు పునరాగమనం ఉంటుంది. క్రైస్తవులందరూ, జీజస్ రెండో రాకడ గురించే ప్రార్థిస్తుంటారు. ఆరోజు కోసం సిద్దపడుతుంటారు. ఆయన పునరాగమన సమయంలో చనిపోయిన వారు, బతికున్నవారు ఆకాశంలోకి వెళ్తారు. అక్కడ దేవుడు వారు భూమి మీద చేసిన మంచి, చెడు పనుల ప్రకారం వారి ఆత్మలను స్వర్గానికి లేదా నరకానికి పంపిస్తాడని విశ్వాసం. తర్వాత భూమిని అంతం చేస్తాడు దేవుడు. ఏప్రిల్ 23న క్రీస్తు పునరాగమనం జరుగుతుందన్నది, డేవిడ్ మీడే అంచనా. అంటే, అదేరోజు భూమి అంతం అవుతుందని భావన.
గ్రహాలస్థితి గతులు, గమనాన్ని కూడా అంచనా వేసి, భూమి అంతం థియరీ చెబుతున్నాడు డేవిడ్ మీడే. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని కొందరు సైంటిస్టులు కూడా అంటున్నారు. ఈ మూడు గ్రహాలు ఒకే క్రమంలోకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించి భూమిని నాశనం చేస్తుందని డేవిడ్ మీడే ప్రగాఢ భావన. అందుకే ఇప్పటివరకు తీరని కోర్కెలు, తీర్చుకోండని సలహా ఇస్తున్నాడు.
డేవిడ్ మీడే. అమెరికన్. తనని తాను, క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్‌గా ప్రకటించుకున్నాడు. జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రాన్ని ఔపోసన పట్టానని చెప్పుకునే డేవిడ్, వీటి నేపథ్యంలోనే 13 పుస్తకాలు రాశాడు. భూమి అంతంపైనే పుస్తకాలు, ప్రసంగాలు చేశాడు. కానీ నాసా వీటిని ఖండించింది. చాలామంది క్రిస్టియన్లు కూడా ఇతని రచనలను తోసిపుచ్చారు.
డేవిడ్ మీడే, డూమ్స్ డే సిద్దాంతకర్త, నోస్ట్రాడామస్‌తోనూ తనను పోల్చుకుంటాడు. కానీ డూమ్స్ డే థియరీ ఫెయిలైంది. డూమ్స్ డే గడియారాన్ని అనుసరించి కూడా కొందరు శాస్త్రవేత్తలు, భూమి అంతానికి సంబంధించి చాలాసార్లు ప్రకటనలు చేశారు. దీని గురించి కాస్త వెనక్కివెళితే మానవాళి తన మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి చేజేతులా ఎంత దగ్గరగా వెళుతోందో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిందే ఈ డూమ్స్‌డే గడియారం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటిసారి అణ్వాయుధాలను తయారుచేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికన్ సైంటిస్టులు, 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే జర్నల్‌ను ప్రారంభించారు. వారే 1947లో తొలిసారిగా డూమ్స్ డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు.
తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా వార్నింగ్ ఇచ్చారు. కానీ డూమ్స్ డే సిద్దాంతమే కాదు, గడియారం అంచనాలు కూడా తప్పాయి. భూమి, దానిపై మానవాళి భద్రంగానే ఉంది. ఇప్పుడు మళ్లీ, అలాంటి పనిలేని ప్రకటనే, డేవిడ్ మీడే చేశాడని, చాలామంది అంటున్నారు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు, భూమి అంతానికి సంబంధించి గతంలోనూ చాలా వార్తలు చూశాం. ఇప్పుడు బైబిల్‌ను అనుసరించి, ఏప్రిల్ 23ను లాస్డ్ డేట్‌గా ప్రకటించాడు డేవిడ్ మీడే. కానీ ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. జరిగేదేదో జరిగిపోతుంది. అంతా నిమిత్తమాత్రులమేనని, సామాజికవేత్తలంటున్నారు. కానీ మతాలు, జ్యోతిష్య శాస్త్రాలను అనుసరించి, భూమి అంతాన్ని అంచనా వేయడం మూర్ఖత్వమని హేతువాదులంటున్నారు.